పది సన్న బియ్యం కేంద్రాలు ప్రారంభం
ఖమ్మం, జూలై 20 : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పది సన్న బియ్యం కేంద్రాలు ప్రారంభించినట్టు జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కల్లాడ, కల్లూరు, వైరా, ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం, సత్తుపల్లి కొత్తగూడెంలలో ఒక్కొక్క కేంద్రం, ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సన్న బియాన్ని కిలో 29 రూపాయలకు ఈ కేంద్రాలలో విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి రైతు బజార్లలోని కేంద్రాలలో వీటికి మంచి ఆదరణ లభిస్తున్నట్టు డీఎస్‌ఓ తెలిపారు. ఇప్పటి వరకు 270 క్వింటాళ్ల బియ్యం విక్రయిస్తున్నట్టు తెలిపారు. బహిరంగ మార్కెట్లలో బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారుల కోరికపై జిల్లాలో మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.