పదోతరగతి పరీక్షలకు వేళాయె

ఖమ్మం,మార్చి13(జ‌నంసాక్షి): ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. సంబంధిత సబ్జెక్టు పరీక్ష రోజు ఆ విషయాన్ని బోధించే ఉపాధ్యాయుడు పరీక్ష విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకున్నారు.  కలెక్టర్‌ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్‌, తాగునీటి వసతి, చీకటి లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.  విద్యార్థినులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకించి మూత్రశాలలు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు, అవసరమైన సెంటర్లలో సిట్టింగ్‌ స్కాడ్‌లు ఉంటారు. జిల్లా విద్యాధికారితో పాటు, తహసీల్దార్లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తారు. ఇన్విజిలేటర్ల నుంచి చీఫ్‌ సూపరింటెండెంట్‌ వరకు ఎవరూ సెల్‌ఫోన్‌లు వాడవద్దనే నిబంధనలున్నాయి. పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరికలు ఇప్పటికే అందాయి.