పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచన
కరీంనగర్,మార్చి13(జనంసాక్షి): జిల్లాలో 16నుంచి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లోపాలు లేకుండా చూసుకున్నారు. అలాగే పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని డిఇవో సూచించారు. కొన్ని కేంద్రాల్లో సిసి కెమెరాల నిఘాలో జరగనున్నాయి. కొన్ని కేంద్రాల్లో సీసీ కెమేరాల మధ్య పరీక్షలు నిర్వహించి మిగిలిన కేంద్రాల్లో యథావిధిగా నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని తల్లిదండ్రులు పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరీక్షలు, విద్యా విధానం చూచిరాతలకు ఆస్కారం కల్పించనప్పటికీ నిఘా మధ్య పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు భయందోళనలకు గురయ్యే అవకాశముందన్న అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు.ఈ విధానంపై పలువురు తల్లిదండ్రులు, విద్యార్థుల్లో అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈసారి మాత్రం పరీక్షల కోసం కేంద్రాల్లో కొత్తగా వాటి ఏర్పాటు లేకున్నా ఉన్న వాటిలో మాత్రం సీసీ కెమేరాలు పని చేసేలా చేస్తూ పరీక్షలు నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. సీసీ కెమేరాల నిఘా మధ్య ఎస్సెస్సీ పరీక్షలు జరిగే పరీక్ష కేంద్రాల్లో ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలే అధికంగా ఉన్నాయి. గతేడాది ప్రయోగాత్మకంగా సీసీ కెమేరాల మధ్య ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 ప్రభుత్వ పాఠశాలల కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. కొత్తగా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమేరాల ఏర్పాటు లేకున్నా గతేడాది వాటిని ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మాత్రం యథావిధిగా కొనసాగిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది ఈ కేంద్రంలో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గత సంవత్సరం ప్రైవేటు పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాలన్నింటిలో సీసీ కెమేరాలు తప్పని సరి అన్న ప్రభుత్వ నిబంధనతో జిల్లాలోని పలు పాఠశాలల్లో వాటిని ఏర్పాటు చేశారు.