పద్మావతి సన్నిధిలో నేడు వరలక్ష్మీవ్రతం

తిరుపతి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో 4న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మీవ్రతం నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు తిరుమాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. టిక్కెట్‌ ఉన్న భక్తులు వరలక్ష్మీవ్రతంలో పాల్గొనవచ్చని అన్నారు. వరలక్ష్మీవ్రతం రోజున ఆలయంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దుచేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు. అన్నప్రసాద వితరణకూ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడా తొక్కిసలాటకు చోటు లేకుండా
బారికేడ్లు, ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇదిలావుంటే శ్రీవారి దేవేరి పద్మావతీ దేవికి సుమారు రూ. 12లక్షల విలువైన బంగారు కాసుల హారాన్ని ఓ భక్తుడు కానుకగా అందజేశారు. తిరుచానూరుకు చెందిన బలరాంనాయుడు దంపతులు బుధవారం 230గ్రాముల బరువుగల బంగారు కాసులమాలను ఆలయ ప్రాంగణంలో డిప్యూటీ ఈవో లోకనాథానికి అందజేశారు. విశేష పర్వదినాల్లో అమ్మవారికి ఈ కాసుల హారాన్ని అలంకరించనున్నట్లు అర్చకులు బాబుస్వామి తెలిపారు.తిరుపతికి చెందిన పొన్నాల సుధాకర్‌ 9హుండీ వస్త్రాలను విరాళంగా అందజేశారు. ఏఈవో ప్రభాకర రెడ్డి, మధు, దామోదరం తదితరులు పాల్గొన్నారు.