పద్మావత్‌కు తప్పని కష్టాలు 

– మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు
– తీర్పుపై సడలింపు ఇవ్వాలని పిటీషన్‌ దాఖలు
– నేడు పిటీషన్‌ దారుల వాదనలు విననున్న న్యాయస్థానం
న్యూఢిల్లీ, జనవరి22(జ‌నంసాక్షి): పద్మావత్‌ సినిమా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు ఈ సినిమాపై మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కాయి. పద్మావత్‌ సినిమాపై గతంలో ఈ రెండు రాష్టాల్రు  నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఇచ్చిన ఆదేశాల్లో కొంత సడలింపు కోరుతూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశాయి. వారి పిటిషన్‌ విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం, మంగళవారం వాదనలు విననుంది. వివాదస్పద చిత్రం పద్మావత్‌పై చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని గతవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. అలాగే ఏదైనా సినిమా విడుదల సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత వివిధ ప్రభుత్వాలేదనని, అది న్యాయస్థానం విధి కాదని వ్యాఖ్యానించింది.
అంతేకాదు ఇతర రాష్టాల్రు  ఈ చిత్రంపై నిషేధం విధిస్తే, ఆ చిత్ర దర్శక నిర్మాతలు తమను ఆశ్రయించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఓ సినిమాపై నిషేధం విధించడమంటే రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు రాజ్యాంగపరమైన విధుల్లో భాగంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఈ చిత్రాన్ని నిషేధించామని రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు పేర్కొన్నాయి. సెన్సార్‌ బోర్డ్‌ ఈ చిత్ర ప్రదర్శనకు అనుమతి ఇవ్వడంపై ఆయా రాష్టాల్రు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు, సెన్సార్‌ బోర్డు అనుమతి లభించడంతో ఈ చిత్రాన్ని జనవరి 25 న దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరోవైపు రాజపుత్‌ కర్ణిసేన ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగుతూ థియేటర్‌లపై దాడులకు పాల్పడుతోంది.