పనికి తగ్గ వేతనం ఇప్పించండి
బోధన్,మే29(జనం సాక్షి ): పట్టణంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల వద్దకు చేరుకోవడంలో వారధులుగా పనిచేస్తున్న తమ సేవలకు తగిన గౌరవ వేతనం ఇప్పించాలని మెప్మా రిసోర్సు పర్సన్లు కమిషనర్ స్వామినాయక్‌కు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. పట్టణంలో పనిచేస్తున్న 38 మంది కమిషనర్‌ను కలిసి సమస్యల జాబితాను అందజేశారు. పదిహేనేళ్లుగా తాము ఆర్పీలుగా చేస్తున్నా గౌరవ వేతనం నెలకు రూ. 12001500 వరకు మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. మహిళా సంఘాల బలోపేతం, జీవనోపాధి శిక్షణలు ఇప్పించడం, బ్యాంకు రుణాల మంజూరు, సంఘాల పుస్తకాల నిర్వహణ వంటి పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ పనితీరును గుర్తించి కనీసం నెలకు రూ. 10 వేలు గౌరవ వేతనంగా అందించాలని కోరారు. అదనపు బాధ్యతల్లో భాగంగా ప్రతి సర్వేకు రూ. 500 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో మెప్మా ఆర్పీల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కనకమ్మ, ఉపాధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి ఆదిలక్ష్మి, సహాయ కార్యదర్శి లక్ష్మి, కోశాధికారి కౌసల్య పాల్గొన్నారు.