పనిభారాన్ని బట్టి పాలన ఉండాలి

C

– విభాగాలు అన్ని చోట్ల ఒకేలా ఉండవు

– దసరా నుంచే కొత్తజిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ప్రారంభం

– కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి):ముందుగా నిర్ణయించిన మేరకు దసరా పండుగ రోజు నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ముందుగా మండలాల ఏర్పాటను గుర్తించాలన్నారు. కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు మొదలైన వాటిపై  ఆయన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో సవిూక్ష జరిపారు. పనిభారాన్ని బట్టి విభజన ఉండాలన్నారు. ఈ సమావేశానికి మంత్రులు జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డితోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు సదుపాయాల కల్పనపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యానికి అనుగుణంగా కొత్త జిల్లాలు ఉండాలని అన్నారు. విభాగాలకు అనుగుణంగా అధికారుల సర్దుబాటు చేయాలన్నారు. కొత్త ఉద్యోగుల నియామకం జరగాలని సూచించారు. దసరా నుంచి కొత్త జిల్లాలతోపాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా ప్రారంభం కావాలన్నారు. ముందుగా కొత్త మండలాలలను నిర్దారించాలని, తర్వాత కొత్త రెవెన్యూ డివిజన్ల కూర్పు చేయాలని తెలిపారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో మొదటి రోజు నుంచే రెవెన్యూ, పోలీసు శాఖలు పని ప్రారంభించాలన్నారు. మిగిలిన శాఖల కార్యాలయాలు అధికారుల నియామకం వీలైనంత త్వరగా చేపట్టాలని ఆదేశించారు.  మూడంచెల్లో పరిపాలన విభాగాలు, అధికారుల నియామకం తదితర పక్రియలను కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై స్పందన, అధికారులు చేసిన కసరత్తు, నివేదిక ఆధారంగా అవసరమున్న మార్పులు చేసి తుది రూపం ఇవ్వాలని తెలిపారు. ప్రారంభ దశలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు  రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 75 మండలాల కోసం డిమాండ్లు వచ్చాయని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వాటిలో ఇప్పటికే 45 మండలాలను నోట్గీ/ చేశామన్నారు. మరో 30 మండలాల డిమాండ్లు, సాధ్యాసాధ్యాలపై నిర్ణయం జరగాల్సి ఉందన్నారు. కొత్తగా ప్రతిపాదించే ఒక్కో మండలంలో జనాభా 35 వేలకు పైబడి ఉండాలని సీఎం సూచించారు.  కొత్త జిల్లాల్లో పాలనా, శాంతిభద్రతల విషయంలో మెరుగైన సేవలు అందించేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్లకు ప్రతీ కుటుంబంపై అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పేదల వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో స్వయంగా పనులు పర్యవేక్షించడం, చిన్న పరిపాలనా విభాగాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. జిల్లా యూనిట్లుగా చిన్నగా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ సులువవుతుందన్నారు. ఆయా ప్రాంతాల స్వభావం, సామాజిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ శాఖలు విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆదిలాబాద్‌లో అంటురోగాలు ఎక్కువ కాబట్టి అక్కడ వైద్యా, ఆరోగ్య శాఖను పటిష్టిం చేయాలని సూచించారు. ఏజెన్సీ ఏరియా ఎక్కువ ఉన్న చోట సంక్షేమ అధికారుల నియామకం చేపట్టాలన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు అవసరం ఎక్కువ కాబట్టి కొత్త ఉద్యోగులను నియమించాలని తెలిపారు. . ఈ సమావేశంలోముసాయిదాలో మార్పులు చేర్పులపై చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు కొత్త జిల్లాల్లో పరిపాలన కార్యాలయాల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు తదితర అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. సవిూక్షలో సిఎస్‌ రాజీవ్‌ శర్మ తదితరులు  పాల్గొన్నారు.