పన్ను ఎగవేత దారులపై కఠినంగా వ్యవహరించండి
– 100 శాతం వసూళ్లపై దృష్టి పెట్టండి
– వాణిజ్య పన్నులశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్
హైదరాబాద్,మే21(జనంసాక్షి): వాణిజ్య పన్నులశాఖ వ్యవస్థ, వసూళ్లను పటిష్టం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే పన్నులు ఎగవేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. శనివారం ఆయన వాణిజ్య పన్నులశాఖ అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అవసరమైతే పన్నులశాఖను పునర్ వ్యవస్థీకరించాలి. ఖాళీలను భర్తీ చేసి వెంటనే ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలి. 100శాతం పన్నులు వసూళ్లు అయ్యే విధానం అమలు చేయాలి. పన్నులు సక్రమంగా చెల్లించే వారిని… చిత్తశుద్ధితో విధులు నిర్వహించే ఉద్యోగులను ప్రోత్సహించాలి. పన్నులు ఎగవేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. రూ.3,600 కోట్ల బకాయిలు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. కేసులు సత్వరమే పరిష్కరమయ్యే విధంగా చూడాలి. పదవీ విరమణ చేసిన అధికారుల సేవలు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. పన్నుల వసూళ్లలో సిబ్బంది కొరత లేకుండా వాణిజ్యపన్నుల శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కోర్టు వివాదాల్లో ఉన్న రూ.3600 కోట్ల పన్ను బకాయిలను, కోర్టు వివాదాల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. వినూత్నంగా ఆలోచించి పన్నులు వసూలు చేయాలని, 100 శాతం పన్నులు వసూలు లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పన్నులు చెల్లించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, పన్ను ఎగవేతదారులతో కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. అవసరమైతే పదవీవిరమణ చేసిన అధికారుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. వాణిజ్యపన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా జరిపే కొనుగోళ్లలో టీడీఎస్ విధానాన్ని అమలుచేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదిలావుంటే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అమెరికన్ తెలుగు సంఘం అసోసియేషన్(ఆటా) ప్రతినిధులు కలిశారు. జులై 1 నుంచి మూడు రోజుల పాటు చికాగోలో జరిగే ఆటా మహాసభలకు హాజరుకావాలని సీఎంను వారు ఆహ్వానించారు. ఆటా ప్రతినిధుల ఆహ్వానానికి సీఎం సానుకూలంగా స్పందించారు.




