పన్నూ హత్యకు కుట్ర కేసు లో భారత్‌ దర్యాప్తు పై అమెరికా సంతృప్తి

 పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తులో భారత్‌ కచ్చితమైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకొంటుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది.

మంగళవారం ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు వారం క్రితమే భారత్‌ చర్యలపై అదే శాఖకు చెందిన మరో ప్రతినిధి మాథ్యూమిల్లర్‌ సంతృప్తి వ్యక్తంచేశాక కూడా తిరిగి ఈ రకం వ్యాఖ్యలు రావడం గమనార్హం. పటేల్‌ మాట్లాడుతూ.. ”దర్యాప్తులో కచ్చితమైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకొనేవరకు అమెరికా సంతృప్తి చెందదు. ఇప్పటివరకు ఫలప్రదమైన చర్చలు జరిగాయని, మా దర్యాప్తులను ముందుకుతీసుకెళ్లడానికి అవసరమైన సమాచారాన్ని ఇరు ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకొంటున్నాయి” అని పేర్కొన్నారు. అంతకుమించి సమాచారం వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

గత ఏడాది నవంబరులో న్యూయార్క్‌లోని ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూను హతమర్చడానికి చేసిన ప్రయత్నాలను తాము భగ్నం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ క్రమంలోనే అక్కడి కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. వాటిల్లో భారత ప్రభుత్వంతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌, మాజీ రా చీఫ్‌ సుమంత్‌ గోయల్‌, రా ఏజెంట్‌ విక్రమ్‌యాదవ్‌, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్‌ గుప్తా పేర్లు ఉన్నాయి.

మరోవైపు ఉగ్రవాది పన్నూ మాత్రం అమెరికా నుంచే భారత్‌పై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇటీవల నవంబరు 1 నుంచి 19వ తేదీల మధ్యలో ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని అతడు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్‌ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని పన్నూ అన్నాడు. అందులో ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు.