పరస్పర సహకారం..
గవర్నర్ సమక్షంలో ‘ఉన్నత విద్య’ పంచాయితీ
హైదరాబాద్,మే26( జనంసాక్షి): రాష్ట్ర విభజన తరవాత ఉన్నత విద్యామండలిపై ఏర్పడ్డ ప్రతిష్టంభన త్వరలో తొలగిపోనుంది. ఉమ్మడిగా సమస్యను పరిస్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల మంత్రులు నిర్ణయించారు. విద్యా పరంగా నెలకొని ఉన్న సమస్యలను మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని గవర్నర్ చేసిన సూచన మేరకు తెలంగాణ ఉన్నతవిద్యాశాఖ మంత్రి కడియం ఛాంబర్‌కు ఎపి మంత్రి గంటా శ్రీనివసారావుతో సహా పలువురు అధికారులు వెళ్లి చర్చించారు. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ సచివాలయంలోని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఛాంబర్‌లో ఆయనతో గంటా భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించి పరస్పరం సహకరించుకోవాలని, ఫైళ్లను, ఉద్యోగులను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అనంతరం గంటా విూడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఉన్నత విద్యామండలిలో ఉద్యోగులు, రికార్డులు, కౌన్సెలింగ్ స్థలం, ఫర్నిచర్ గురించి ఆ ప్రభుత్వాన్ని అడిగామన్నారు. జూన్ 12న ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున దానికోసం ఉన్నత విద్యామండలిలో స్థలం, డేటా, కంప్యూటర్లు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కలిసి వెళ్లాలని కోరామని… దానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. తమకున్న ఇబ్బందులపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని.. త్వరలోనే కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిసి.. సమస్యలు చెబుతామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణకు తమ ఉద్యోగుల సేవలు అందించేందుకు సిద్ధమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలిలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగుల సేవలు తమకే కావాలని, ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించుకునేందుకు ఉన్నత విద్యామండలిలో స్థలం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిందని తెలిపారు. ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం తమ ఉద్యోగుల సేవలు అందిస్తామని హావిూ ఇచ్చినట్లు తెలిపారు. పరస్పరం సహకరించుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించాం. గవర్నర్ సూచన మేరకు కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం. పలు అంశాలపై చర్చించుకున్నామని గంట శ్రీనివాస్ తెలిపారు. రికార్డులు, స్థలం, ఉద్యోగులు లాంటి సమస్యలపై చర్చించుకున్నాం. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. చర్చల్లో చాలా అంశాలు కొలిక్కివచ్చాయన్నారు.