పరిమితులకు లోబడే ఇసుక తవ్వకాలు జరపాలి జేసీ భాస్కర్‌

శ్రీకాకుళం, జూలై 31: లీజు ఖరారైన ఇసుక ర్యాంపులను పరిమితులకు లోబడి నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ హెచ్చరించారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఇసుక వేలం పాటలు ముగిసిన తరువాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. ర్యాంపుల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులందినందున ఈసారి మరింత కఠిననిబంధనలతో టెండర్ల పిలిచామని చెప్పారు. టెండర్లు దక్కించుకున్నంత మాత్రాన ఇష్టమెచ్చినట్టు తవ్వకాలు జరిపితే సహించేది లేదని లీజుదారులను హెచ్చరించామన్నారు. యంత్రాలతో తవ్వకాలు జరపకూడదని, లారీల్లో ఇసుక తరలించరాదని, నిర్దేశిత కాల వ్యవధిలోనే తవ్వకాలు జరపాలని సూచించామన్నారు. ట్రాక్టర్లతోనే ఇసుక రవాణా చేయాలని, వాటి నంబర్లు తమకివ్వాలని, రోజువారీ తరలిస్తున్న ఇసుక వివరాలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా తమకు పంపించాలని ఆదేశించామన్నారు. ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచుతామని చెప్పారు. ఇసుక తవ్వకాలపై నిఘా పెడతామని, దీనికోసం ప్రత్యేక టాస్క్‌పోర్స్‌ పని చేస్తుందని వివరించారు. ర్యాంపుల్లో అక్రమాలు జరిగితే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయనున్న కాల్‌ సెంటర్‌కు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. కొన్ని ర్యాంపులకు మాత్రమే అనుమతులిచ్చి, మిగతావాటి విషయంలో వివక్ష చూపారన్న ఆరోపనలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని జేసీ చెప్పారు. వేలం పాట ద్వారా రూ. 12.45 కోట్లు ఆదాయం:- జిల్లాలో ఆరు ర్యాంపులకు వేలం పాట నిర్వహించగా రెండింటిని కడప, రాజమండ్రికి చెందినవారు దక్కించుకున్నారు. మిగతా నాలుగింటిని కాంగ్రెస్‌ నేతలకు చెందిన వ్యక్తులే దక్కించుకున్నారు. వీరిలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచరులు మాజీ ఎంపీపీ అంబటి శ్రీనివాసరావుకు చెందిన గంగమ్మ మోడరైన్‌ రైసుమిల్లు పేరున రెండు, ధర్మేంద్ర అనే వ్యక్తికి ఒకటి కాగా మరో ర్యాంపును ఎంపీ కృపారాణి అనుచరుడు కిల్లి మల్లన్న దక్కించుకున్నారు. వీరి ద్వారా ఈ ఆరు ఇసుక ర్యాంపులకు ఆదాయం 12.45 కోట్ల రూపాయలు వచ్చింది. అయితే గత ఏడాది కంటే ర్యాంపుల ద్వారా ఆదాయం కొంత తక్కువ రావడంతో గుత్తేదారుల్లో ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలుస్తోంది.

తాజావార్తలు