పరిస్థితి అంచనా వేస్తున్నాం

– మూడు రోజుల్లో స్వయంగా పర్యటిస్తా

– రావత్‌

న్యూఢిల్లీ,ఆగష్టు 18(జనంసాక్షి): చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులను ఆర్మీ చీప్‌ బిపిన్‌ రావత్‌ స్వయంగా పర్యవేక్షించనున్నారు. అలాగే సరిహద్దులో ఉన్న జవాన్లకు ధైర్యం కల్పించనున్నారు. భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ జమ్మూ కశ్మీర్లోని లద్దాక్‌ వెళ్లనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు చైనా సరిహద్దు వెంట పర్యటించనున్నారు. ఇటీవల భారత సైనికులపై చైనా దళాలు రాళ్లదాడికి దిగడంతో ఇక్కడ చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా సరిహద్దుల్లో భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆర్మీ చీఫ్‌ వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడి సైనిక యూనిట్‌కు ఓ అవార్డు కూడా ప్రధానం చేయనున్నట్టు సమాచారం. మంగళవారం చైనా దళాలు సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా సైనికులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇరుదేశాల సరిహద్దు భద్రాతాధికారులు సమావేశమయ్యారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామనీ… సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుతామని అంగీకరించారు.