పరిహారం ఇచ్చి పనులు చేయాలి

ఏలూరు,మే4(జ‌నంసాక్షి): పరిహారమివ్వకుండా నిర్వాసిత గ్రామాల్లో పోలవరం ప్రాజెక్టు మట్టిని డంపింగ్‌ చేయడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరామ్‌  అన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో పోలవరం గ్రామాన్ని మట్టిగుట్టలతో ప్రమాదకరంగా మారుస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మరోపక్క నష్టపరిహారమివ్వని భూముల్లో కూడా మట్టిని డంపింగ్‌ చేస్తున్నారన్నారన్నారు. కడెమ్మ స్లూయీజ్‌ కాలువ మొత్తం మట్టి డంపింగ్‌తో పూడ్చి గ్రామానికి దగ్గరగా కాలువ తవ్వుతున్నారని తెలిపారు. కొండవాగుల నీరు, వర్షం నీరు సుమారు ఎనిమిది నుండి పది క్యూసెక్కులు ఈ కాలువ గుండా గోదావరిలో కలవాల్సి ఉందని, కడేమ్మ స్లూయీజ్‌ గేట్లు పూర్తిగా తెరుచుకోని పరిస్థితుల్లో ఈ నీరు అధికంగా వస్తే పంటలు, పోలవరం
ఏటిగట్టు కుడివైపు గ్రామాలు నీటమునిగే ప్రమాదం ఉందన్నారు. ముందస్తు చర్యలుగా అధికారులు కడెమ్మ స్లూయీజ్‌ గేట్లకు మరమ్మతులు చేపట్టి ప్రమాదనివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.