పర్యాటకులను ఆకర్షిస్తున్న పోచారం ప్రాజెక్ట్
నిజామాబాద్, అక్టోబర్ 31 : ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల రైతాంగానికి వరప్రదాయినిగా నిలుస్తున్న పోచారం ప్రాజెక్టు పర్యాటకుల మదిని దోచుకుంటుంది. రోజురోజుకూ ప్రాజెక్టు వద్ద సంతరిం చుకుంటున్న ప్రకృతి అందాలను కనులారా తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా చిరుజల్లులు పడుతున్న సమయంలో ప్రాజెక్టు జలాశయం ఒడ్డున ఉన్న అతిథిగృహం రెండంతస్తుల భవనంపై నుండి చూసే దృశ్యం ఎవరినైనా పులకరింపజేస్తుంది.ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఇక్కడ పర్యాటకుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ పర్యాటకులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు ఉండవు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని ప్రాజెక్టు పైనుండి పొంగిపొర్లుతున్న జలపాతం నీటి దృశ్యం మనసులను రంజింపజేస్తుంది. ఇంతే కాకుండా ప్రాజెక్టుకు జలాశయం వద్దకు వెళ్లే ముందున్న కాజ్‌వే రోడ్డుపై నుండి పారుతున్న నీటి దృశ్యం సైతం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది. హైదరాబాద్, మెదక్, కర్ణాటక, మహారాష్ట్ర జిల్లా కేంద్రంతో పాటు ఎన్నో మండలాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. పర్యాటక ప్రాంతంగా పోచారం ప్రాజెక్టును తీర్చిదిద్దాలని నాటి నుండి నేటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా పోచారం ప్రాజెక్టుకు పర్యాటక శోభను కలిగించలేకపోతున్నారు. వైఎస్‌ఆర్ పుణ్యమా అంటూ 14 కోట్లు ఈ ప్రాజెక్టుకు మంజూరు కాగా కేవలం ఎ జోన్ ప్రాంతంలో ప్రధాన కాల్వలు బాగుప డటం గమనార్హం. ఇప్పటికీ బి జోన్ ప్రాంతంలోని ఎల్లారెడ్డి మండల రైతులకు మాత్రం పోచారం ప్రాజెక్టు నీటిని అందించే ప్రధాన కాల్వ సరిగా లేక పోవడం ఈ ప్రాంత రైతులకు శాపంగా మారింది. ఇప్పటికైనా పోచారం ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే సరైన న్యాయం జరుగుతుందని పర్యాటకులతో పాటు రైతులు అంటున్నారు.