పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు

C

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో సిటీలో ఉన్న చెరువులను ఆధునీకరిస్తామని అన్నారు. మంత్రి కేటీఆర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, అధికారులు దుర్గం చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా దుర్గం చెరువు ఆధునీకరణపై అధికారులతో కేటీఆర్‌ చర్చించారు.  అనంతరం మంత్రి కేటీఆర్‌ విూడియాతో మాట్లాడుతూ.. దుర్గం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఐఐసీ నుంచి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. రోడ్‌ నెం. 45 నుంచి దుర్గం చెరువు విూదుగా ఇనార్బిట్‌ మాల్‌ వరకు రూ. 184 కోట్లతో రోడ్‌కం బ్రిడ్జి నిర్మాణం చేపట్టబోతున్నామని తెలిపారు. మరో రూ. 20 కోట్లతో దుర్గం చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, సైక్లింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు ఉన్నందున ఈ ఏరియాలో ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కువగా ఉంటుందన్నారు. రోడ్‌కం బ్రిడ్జి నిర్మాణం ద్వారా ట్రాఫిక్‌ సమస్యలు తీరుతాయని చెప్పారు. రోడ్‌కం బ్రిడ్జి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు.

దుర్గం చెరువు ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా రూ. 20 కోట్లతో హంపీ థియేటర్‌ బోటింగ్‌ పనులకు త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. దుర్గం చెరువు ప్రక్షాళనకు పలు కార్పోరేట్‌ సంస్థలు ముందుకొచ్చాయని, హెరిటేజ్‌ రాక్‌జోన్‌కు ముప్పు లేకుండా చర్యలు చేపడతామని మంత్రి వివరించారు.