పలు కీలక అంశాలపై కేబినేట్‌ చర్చ

భారత్‌-దక్షిణ కొరియా మధ్య ఒప్పందానికి ఆమోదం

లక్షకోట్లు దాటిన జిఎస్టీ వసూళ్లు

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఢిల్లీలో సమావేశం అయింది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించింది. భారత్‌-దక్షిణ కొరియా మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలన్నింటిని అంతర్జాతీయ సౌర కుటుంబంలోకి ఆహ్వానించాలనే భారత్‌ తీర్మానానికి ఆమోదం తెలిపింది. రవాణా, విద్య, రైల్వే రంగాల మధ్య రష్యాతో ఎంవోయూకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జార్సగూడ ఎయిర్‌పోర్ట్‌ పేరును ఒడిశా వీర్‌ సురేంద్ర సాయి ఎయిర్‌ పోర్ట్‌గా మార్చేందుకు ఆమోదముద్ర వేసింది. ఇదిలావుంటే దేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి లక్ష కోట్లు దాటాయి. పండుగ సీజన్‌ కావడంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. దీంతో జీఎస్టీ వసూళ్లు ట్రిలియన్‌ మార్క్‌ ను అధిగమించాయి. గత నెల కంటే అక్టోబర్‌ నెలలో 6.64 శాతం వసూళ్లు పెరిగి లక్షా 7వందల కోట్లకు చేరాయి. సీజీఎస్‌టీ 16 వేల 464 కోట్లు కాగా, రాష్టాల్ర జీఎస్‌టీ 22 వేల 826 కోట్లు. ఇక, ఐజీఎస్టీ వసూళ్లు 53 వేల 419 కోట్లు. ఇందులో ఎగుమతుల ద్వారా 26 వేల 908

కోట్లు, సెస్‌ రూపంలో 8,000 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాదిలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ లో కూడా లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.