పల్లెపై విషం చిమ్ముతున్న కెమికల్‌ పరిశ్రమపై ప్రజల ధర్మాగ్రహం


అధికారులు పట్టించుకోని పర్యావసానం
తిమ్మాపూర్‌, జూన్‌ 27 (జనంసాక్షి) :
తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి గ్రామంలోని హరిత బయో ప్లాంట్‌పై ఆ గ్రామస్తులు సామూహిక దాడికి పాల్పడ్డారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దుర్గంధం వెదజల్లుతున్న విషతుల్యమైన రసాయనాలు వల్ల రోగాలబారిన పడుతున్నామని, పంటలు సర్వనాశనమవుతున్నాయని, ఈ ఫ్యాక్టరీని మూసేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులు బుధవారం దాడి చేశారు. కార్యాలయం తలుపులను బద్దలు కొట్టి లోనికి ప్రవేశించిన ప్రజలు అందులోని ఫర్నిచర్‌, వస్తు సామగ్రిని ధ్వంసం చేశారు. బీరువా పగులగొట్టారు. ఆఫీసు ఫైళ్లను చిందర వందర చేశారు. టేబుళ్లు, కుర్చీలు విరగొట్టారు. నానా బీభత్సం సృష్టించారు. అంతేకాకుండా కార్యాలయం ముందు పార్కింగ్‌ చేసి ఉన్న కారు, జీపు, ఇతర వాహనాల అద్దాలు పగులగొట్టడమే కాకుండా వాటిని బోల్తా వేశారు. ఈ ప్లాంట్‌ నుంచి వెలువడుతున్న వ్యర్థ, రసాయన పదార్ధాల వల్ల దుర్గంధం వస్తోందని,వాంతులు, విరేచనాలు, దురద, నడుం నొప్పులు, కీళ్లనొప్పులతో బాధపడుతున్నామని, వీటి కారణంగా అనారోగ్యం బారినపడ్డ వారు ప్రతి ఇంటా ఉన్నారని, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి, సంబంధిత అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో పర్లపల్లి గ్రామస్తులు మెరుపుదాడికి పాల్పడ్డారు. వయో లింగ బేధం లేకుండా అందరూ పాల్గొన్నారు. ఈ దాడిలో చిన్నపిల్లలల నుంచి కాటికాళ్లు సాచే ముసలి వాళ్లు కూడా పాల్గొనడం విశేషం. దాడి విషయం తెలుసుకున్న కరీంనగర్‌ డీఎస్పీ చక్రవర్తి ప్రత్యేక బలగాలతో హుటాహుటిన పర్లపల్లికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గ్రామస్తులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. ఈ ప్లాంట్‌ మూసే వరకూ తాము ఊర్కోబోమని పర్లపల్లి గ్రామస్తులు డీఎస్పీకి ఖరాఖండిగా చెప్పారు. తమకు ఖచ్చితమైన హామీ ఇచ్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.