పవిత్రతకు ప్రతిరూపం రంజాన్
పవిత్రత అన్నది ప్రతి మతంలోనూ ఉంటుంది. అయితే దానిని ఆచరించడం..కఠినంగా ఉన్నా స్వీకరించడం అన్నదే ముఖ్యం. పవిత్ర రంజాన్ సందర్భంగా నెలరోజులపాటు కఠిన ఉపవాసదీక్ష చేసి ముగించడం ఓ అరుదైన పవిత్ర కార్యక్రమం. ఇది కేవలం ముస్లిం మతంలోనే ఉంది. రంజాన్ మాసం సందర్భంగా నెలరోజులు ప్రతి ఒక్కరూ దీనిని పవిత్ర కార్యంగా అల్లాహ్ కోసం నియమ నిబంధనలతో పాటించడం బహుశా అరుదైన విశేషమైన ప్రక్రియగా చూడాలి. ఇందులో ఆరోగ్య సూత్రాలూ ఇమిడి ఉన్నాయి. భగవంతుడిపై ప్రేమా ఉంది. కఠిన ఆచారమూ ఉంది. ఇంతటి పవిత్రమైన ఈ మాసం ముగింపు సందర్భంగా ఈదుల్ ఫితర్ జరుపుకోవడం ద్వారా పవిత్ర రంజాన్ మాసం ముగుస్తుంది. ఈ నెలరోజుల కఠిన ఉపవాసంలో అనుసరించిన సన్మార్గాన్ని యేడాదంతా కొనసాగించాలని మహ్మద్ ప్రవక్త ఆదేశం. ఆ మేరకు అతి పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. అల్లాహ్‌తో మన సంబంధాలు మరింత దృఢం చేసుకొనే అవకాశాన్ని రంజాన్ అందించింది. అల్లాహ్‌ను మన్నింపు కోరుకోవడానికీ, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో విశ్లేషించుకోవడానికీ, మన జీవిత లక్ష్యం, మన జీవిత గమ్యం గురించి ఆలోచించడానికీ, దైవాదేశాల ప్రకారం మన జీవితాల్ని చక్కదిద్దుకోవడానికీ అవసరమైన అవకాశాన్ని రంజాన్ మాసం కల్పించింది. ఆ అవకాశాన్ని మనం ఎంతవరకూ ఉపయోగించుకున్నామన్నది ఆలోచించుకోవడానికి ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భగవంతుడి ఆదేశాలను పాటిస్తారు.రోజా మనలో ఉన్న మాలిన్యాన్ని కడిగేయడానికి ప్రయత్నిస్తుంది. చెడుకు దూరం చేసి.. సత్పవ్రర్తనవైపు నడిపిస్తుంది. ఖురాన్‌లో రోజా అంటే ఉపవాసం ప్రాధాన్యాన్ని అల్లాహ్ వెల్లడించారు. దీని ప్రకారం ప్రతి ముస్లిం తప్పక ఉపవాసం పాటించాల్సిందే. పేద వారి ఆకలి ఎలా ఉంటుందో తెలియజేయడమే దీని పరమార్థం. ఉపవాస నియమాలు ఎలా ఉంటాయంటే.. వేకువజామున 4 గంటల లోపు (సహర్) భోజనాది కార్యక్రమాలు పూర్తిచేయాలి. మళ్లీ సాయంత్రం 6.30 వరకు (ఇఫ్తార్) వరకు ఎటువంటి ఆహారం, నీరు తీసుకోకూడదు. లాలాజలం కూడా మింగకూడదు. రోజూ సుమారు 14 గంటల వరకు ఈ ఉపవాస దీక్ష ఉంటుంది. సహర్ తో మొదలై ఇఫ్తార్‌తో రోజా ముగుస్తుంది. రోజాలకు సహర్, ఇఫ్తార్‌లు ప్రాణప్రదం. ముస్లింలు ఉపవాసం పాటించడానికి ముందు తెల్లవారుజామున భుజించడాన్ని సహర్ అంటారు. ఫజర్ నమాజ్‌కు ముందే లేచి తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా గడపవచ్చు. దైవారాధనలు, ఖురాన్ పారాయణం చురుగ్గా చేసుకోవచ్చు. ఇదే సహర్‌లో ఉన్న శుభం. అల్లాహ్ అనుమతించిన వేళలో ఆహారం తీసుకోవడం ద్వారా.. ఉపవాసం పాటించాలన్న దైవాజ్ఞను నిర్వర్తించగలిగే శక్తి వస్తుంది. సాధారణంగా అంత తెల్లవారుజామున ఆహారం తీసుకోవాలని అనిపించదు. కానీ, సహర్ భుజించకపోతే నిస్సత్తువ ఆవహిస్తుంది. దైవారాధనలో ఏకాగ్రత సడలుతుంది. ఉపవాసం అంటే శరీరాన్ని కృశింపజేసుకోవడం కాదు. దైవంపై మనసు నిలపడం అని గ్రహించాలి. అందుకే సహర్ భుజించి సాయంత్రం వరకు దైవారాధనలో కాలం గడపాలి. బాలింతలకు, ప్రయాణంలో ఉన్నవారికి, రోగగ్రస్థులకు ఈ ఉపవాసం నుంచి మినహా యింపు ఉంటుంది. అయితే బాలింతలు, ప్రయాణంలో ఉన్నవారు ఆ తర్వాత వీటిని ఆచరించాల్సి ఉంటుంది. ఉపవాసం ఉన్న వ్యక్తి చెడుతలంపులకు దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఘర్షణలకు దిగకూడదు. ఎవరైనా ఘర్షణకు దిగినా.. నేను ఉపవాసంలో ఉన్నానంటూ చెప్పుకుని తప్పుకోవాలి. ఇకపోతే ఖురాన్ ఘనమైన రాత్రిలో అవతరింపజేశారు. ఆ రాత్రి ఆత్మ, దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతిఆజ్ఞను తీసుకొని అవతరిస్తారు. ఆ రాత్రి తెల్లవార్లూ పూర్తిగా శాంతి, శ్రేయాలేఅవతరిస్తుంటాయి. ప్రవక్త ముహమ్మద్‌కు వినిపించిన దైవవాణి ఇది. అది వినిపించిన రాత్రి మరేదో కాదు లైలతుల్ ఖద్ర్. అదృష్ట, దురదృష్టాల నిర్ణయాల అమలుకు అల్లాహ్ దైవదూతలకు ఫర్మానాలు అందజేసే రాత్రి ఇది. పవిత్రమైన ‘లైలతుల్ ఖద్ర్’ అనే మాటలో లైల్ అంటే రాత్రి అని అర్థం. ఖద్ర్ అంటే అదృష్టం, భాగ్యం. సృష్టిలోని సర్వరాశుల విధిరాత ఈ రాత్రే లిఖిస్తారని నమ్మకం. అందుకే దీనిని లైలతుల్ ఖద్ర్ అని వ్యవహరిస్తారు. ఖద్ర్ అంటే శ్రేష్ఠమైన అని మరో అర్థం ఉంది. అందుకే దీనిని శ్రేష్ఠమైన రాత్రిగా కూడా అభివర్ణించారు. ఖద్ర్ అంటే ఇరుకు అనే భావం ఉంది. ఈ రాత్రి దైవదూతలతో భూలోకమంతా కిక్కిరిసిపోతుందట. సౌభాగ్య, దౌర్భాగ్యాల నిర్ణయం జరిగే రాత్రి ఇదని విశ్వాసం. అందుకే దీనిని మహత్పూరకమైన, గౌరవాదరణల రాత్రి అని ఖురాన్ విశదీకరించింది. శ్రేష్ఠమైన రాత్రిని అందరూ అన్వేషించాలని సూచించారు ప్రవక్త. రంజాన్ నెలలో చివరి పది రోజులు ఆయన మసీదులోని నాలుగు గోడలకే పరిమితం అయ్యేవారు. పూర్తిగా దైవారాధనలో మునిగిపోయేవారు. ఇలా పది రోజులు మసీదులోనే గడపడాన్ని ‘ఏతికాఫ్’ అంటారు. లైలతుల్ ఖద్ర్‌లో పూర్ణ విశ్వాసంతో, దైవం ప్రసాదించే ప్రతిఫలాన్ని ఆశించి ఆరాధన చేసిన వారి గత అపరాధాలన్నిటినీ దైవం క్షమిస్తాడు అని ప్రవక్త ఉపదేశించారు. అందుకు అనుగుణంగా రంజాన్ చివరి పదిరోజులు ముస్లింలు ఏతికాఫ్ పాటిస్తారు. ఖురాన్ పారాయణం చేస్తారు. రాత్రంతా దైవారాధనలో గడుపుతారు. పండుగ రోజున తలస్నానం చేయడం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం, కొత్త దుస్తులు ధరించడం ఉత్తమం. ఇది మహా ప్రవక్త వారి ఆచరణ విధానం. పట్టణంలో లేక గ్రామం వెలుపల ఒక బహిరంగ ప్రదేశంలో ఈద్ నమాజ్ చెయ్యడం ఉత్తమం. ఈదుల్ ఫిత్ర్ నమాజ్‌కు ముందు కొన్ని ఖర్జూర పండ్లు తిని వెళ్ళాలి. నమాజ్‌కు వెళ్ళే సమయంలో తక్బీర్ చదువుతూ ఈద్గాహ్‌కు చేరుకోవాలి. నమాజ్ చదివిన తరువాత సలాములు చేస్తూ, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్సాహంగా, ఉల్లాసంగా బంధు, మిత్రులతో గడపాలి. ఎలాగైతే రంజాన్ నెలవంకను చూసి మనం ఉపవాసాలు ఉండడం మొదలుపెడతామో, అలాగే షవ్వాల్ నెలకు చెందిన నెలవంకను చూడగానే ఉపవాసాలను ఆపేసి, మరుసటి రోజు ఈదుల్ ఫిత్ర్ పండుగను జరుపుకోవాలి.ఎవరైతే పుణ్య ఫలాపేక్షతో ఈ రెండు పండుగుల రాత్రులూ దైవారాధనలో గడుపుతారో- వారి హృదయాలూ, ఇతరుల హృదయాలూ నిర్జీవమైపోయినప్పుడు కూడా సజీవంగా ఉంటాయని దైవప్రవక్త సెలవిచ్చారు.