పశుబీమాతో రైతులకు దీమా
రైతుల్లో చైతన్యం కోసం కార్యక్రమాలు
హైదరాబాద్,డిసెంబర్19(జనంసాక్షి): పాడిరైతులను ప్రోత్సహిచేందుకు పాడి పశువులను కోల్పోయిన రైతులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చాయి. పశువు ఏ కారణంతోనైనా మరణిస్తే దాని పూర్తి విలువను బీమా ద్వారా చెల్లించే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో గ్రామాల్లో దీనిపై ప్రచారం చేసి రైతులను చైతన్యం చేసేలా ప్రోత్సహించాలని పశుసంవర్ధక అధికారులకు ఆదేవాలు ఇచ్చారు. దేశవాళీ, సంకరజాతి ఆవులు, బర్రెల్లో చూలు పశువు అయినా, పాలిచ్చేదైనా, ఎండిపోయినదైనా, ఒకసారి ఈనని ప్రతి ఆవు, బర్రెకు ఈ పథకం వర్తిస్తుంది. పదేళ్లలోపు ఉండి ఐదు ఈతలకు మించని పశువులై ఉండాలని అధికారులు చెబుతున్నారు. మార్కెట్ విలువనుబట్టి 10వేల నుంచి 60వేల వరకు పశువులపై బీమా చేసుకోవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. పశును కోల్పోయినపుడు ఈ మొత్తాన్ని బీమా కంపెనీ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న పశు సంపదతోపాటు ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా సబ్సిడీపై అందిస్తున్న పాడి పశువులు పలు కారణాలతో మృత్యువాత పడడంతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. ఇటీవలి కాలంలో బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని పాడి పశువులు కొనుగోలు చేసుకుంటున్న రైతులకు పశు వైద్యాధికారులే ప్రీమియం నిలుపుకొని రైతులకు అందిస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ప్రీమియం భరిస్తుంటే రైతులు మరో 20 శాతం మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంది. దేశవాళీ, అధిక పాల ఉత్పత్తిని ఇచ్చే పాడి పశువులకు అవకాశం కల్పించారు. ఒక ఏడాదికి లేదా మూడేళ్ల కోసం బీమా సదుపాయం కల్పిస్తున్నారు. పాడి పశువులు ఉన్న ప్రతి వర్గం రైతులు ఈ బీమా పథకంలో చేరేందుకు అర్హులని అధికారులు చెబుతున్నారు. పాడి రైతులు తమకున్న ఎన్ని పశువులకైనా బీమా చేసుకునే అవకాశం ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రీమియం రాయితీ మాత్రం ఒక రైతుకు చెందిన ఐదు పశువులకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. మిగతా పశువులకు వంద శాతం ప్రీమియం రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుందని వారు వివరిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో 20 శాతం షెడ్యూలు కులాల రైతులు ఉండేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ పథకం అమల్లోకి వచ్చాక జిల్లాల్లో అనేక మంది రైతులు ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు తెలిపారు. బీమా సదుపాయం రాష్ట్రంలోని అన్ని
జిల్లాల్లో అమల్లో ఉంది. పశువులు ప్రమాదాలకు గురైనా, వ్యాధుల బారినపడినా, ప్రకృతి వైపరీత్యాల వల్లనైనా మృత్యువాత పడితే బీమా వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకం కింద ఏడాది పాటుగానీ, మూడేళ్లపాటుగానీ పశువులకు బీమా ప్రీమియం చెల్లించుకోవచ్చు. మూడేళ్ల కాలానికి ప్రీమియం చెల్లిస్తేనే రైతులకు లాభం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బీమా కోసం రైతులు స్థానిక గోపాలమిత్ర, ప్రభుత్వ పశువైద్యశాల సిబ్బంది, డివిజన్, జిల్లాస్థాయి పశుసంవర్థక అధికారులు, బీమా కంపెనీ, కార్యనిర్వాహక అధికారిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. బీమా చేసిన పశువును అమ్ముకోవాల్సి వస్తే కొనుగోలు చేసిన రైతుకు కూడా వర్తిస్తుందనీ, పశువు యూనిట్‌గా బీమా ప్రీమియం చెల్లింపు జరుగుతున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. చాలా మంది రైతులకు పాడి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. వేలకు వేలు వెచ్చించి రైతులు పశువులను కొనుగోలు చేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ వర్గాలకు చెందిన రైతులకు రాయితీపై పాడి పశువులను అందించి ప్రోత్సహిస్తున్నాయి. ఇలా రైతులు సొంతంగా కొనుగోలు చేసుకున్నవిగానీ, రాయితీపై ఇచ్చినవిగానీ వివిధ కారణాలో మృత్యువాత పడితే రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నది. తిరిగి పశువును కొనుగోలు చేయాలంటే రైతులు అప్పులు చేయాల్సి వస్తున్నది.