పశ్చిమలో చంద్రబాబు ఓదార్పు – మాజీ మంత్రికి కలిదిండికి కన్నీటి నివాళి
ఏలూరు, ఆగస్టు 1: తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఎనలేని సేవలందించి ఆనారోగ్యంతో కన్నుమూసిన నేతల కుటుంబాలను ఓదార్చేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం నాడు జిల్లాకు వచ్చారు.
హైదరాబాద్ నుంచి ఆయన విమానంలో గన్నవరం చేరుకున్న చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండి నియోజకవర్గమైన పెదపుల్లేరు గ్రామానికి వెళ్లారు. ఆదివారం రాత్రి ఆనారోగ్యంతో కన్నుమూసిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు (అబ్బాయి రాజు) పార్థివదేహాన్ని దర్శించారు. భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీకి రామచంద్రరాజు ఎనలేని సేవలందించారని, చిత్తశుద్ధి, అంకితభావంతో పార్టీ పటిష్ఠతకు కృషి చేశారని కొనియాడారు. ఆయన తనకు అత్యంత ఆప్తుడని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. డబ్బువుంటేనే రాజకీయాల్లో రాణించగలమని ఎన్నికల్లో గెలవగలమని అనుకోవడం అపోహ మాత్రమేనని తరచూ తనకు రామంచంద్రరాజు చెప్పేవారని అన్నారు. నిత్యం ప్రజలతో సన్నిహితంగా ఉండే వారే రాజకీయాల్లో రాణిస్తారని ఆయన చేప్పేవారని అన్నారు.
మంత్రిగా, టిటిడి ఛైర్మన్‌గా ప్రజలకు రామచంద్రరాజు విశేష సేవలందించారని అన్నారు. గత ఎన్నికల్లో వయస్సు పైబడిన కారణంగా పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని యువతరానికి అవకాశం ఇచ్చారని అన్నారు. యువకులను పార్టీలో ప్రోత్సహించాలని చెప్పిన నేత ఆయననే అని అన్నారు. అక్కడి నుంచి భీమవరం వెళ్లారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఆనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది, మాజీమంత్రి చింతలపాటి వరప్రసాద మూర్తిరాజును పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. మూర్తిరాజు లాంటి నిజాయితీ పరులు తనకు ఆదర్శమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిరిగి అక్కడి నుంచి అత్తిలి గ్రామానికి వెళ్లారు. కొంత కాలం నుంచి ఆనారోగ్యంతో బాధపడుతు కన్నుమూసిన దివంగత నేత ఈడూరు సూరపరాజు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన నాటి నుంచి సూరపరాజు పార్టీ పటిష్ఠతకు కృషి చేసారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. అక్కడి నుంచి తణుకు పట్టణానికి చేరుకున్నారు. ఆంధ్ర సుగర్స్ కంపెనీ అతిథి గృహంలో పారిశ్రామిక వేత్త డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎం.పి. బుల్లిరామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి కుశల ప్రశ్నలు వేశారు. మాజీ ఎమ్మెల్యే వై.టి.రాజాతో మాట్లాడి అక్కడి నుంచి రాజమండ్రికి వెళ్లారు. మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాగంటి బాబు, ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వరరావు, కె.శివ, సిహెచ్ ప్రభాకర్, వనిత, టి.వి.రామారావు, శేషారావు, జిల్లా పార్టీ కన్వీనర్ సీతామహాలక్ష్మి, పార్టీ నేతలు పి.ప్రసాద్, జి.బాబు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.