పశ్చిమాసియాలో రాజుకున్న వేడి

` ఇజ్రాయెల్‌ భీకర దాడిలో నలుగురు ఇరాన్‌ సైనిక సలహాదారులు మృతి
డమాస్కస్‌(జనంసాక్షి): ఇజ్రాయెల్‌` హమాస్‌ల పోరు వేళ.. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కుతోంది. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఓ భవనంపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ కు చెందిన నలుగురు సలహాదారులు మృతి చెందారు. టెహ్రాన్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీని వెనుక టెల్‌అవీవ్‌ హస్తం ఉందని ఆరోపించింది. మృతుల వివరాలు వెల్లడిరచలేదు. సిరియాలో కుద్స్‌ ఫోర్స్‌ ఉన్నతాధికారి జనరల్‌ సాదేగ్‌ ఒమిద్జాదే, అతడి డిప్యూటీ హజ్‌ గోలమ్‌లు చనిపోయినవారిలో ఉన్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది.ఇరాన్‌ మద్దతుగల సంస్థల అధికారులు సమావేశమైన సందర్భంలో ఈ దాడి జరిగినట్లు ‘సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌’ తెలిపింది. ఐదుగురు ఇరానీయన్లు, ఒక సిరియన్‌ మృతి చెందినట్లు చెప్పింది. ఇరాన్‌వాసుల్లో ముగ్గురు కమాండర్లు ఉన్నారని వెల్లడిరచింది. మరో నలుగురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు పేర్కొంది. వెనిజులా, దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయాలకు సవిూపంలో ఈ దాడి జరిగినట్లు సిరియా స్టేట్‌ టీవీ తెలిపింది. ఇజ్రాయెల్‌ క్షిపణులు నాలుగు అంతస్తుల భవనాన్ని మొత్తం ధ్వంసం చేశాయని ఓ అధికారి వెల్లడిరచారు. నెతన్యాహు ప్రభుత్వం ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు.హమాస్‌కు, ఇతర ఉగ్రవాద సంస్థలకు టెహ్రాన్‌ ఆర్థిక, సైనిక సాయం చేస్తోందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబరులో డమాస్కస్‌ శివారులోని జైనాబియా జిల్లాలో జరిపిన వైమానిక దాడిలో ఇరాన్‌ సైనిక సలహాదారు, బ్రిగేడియర్‌ సయ్యద్‌ రజీ మౌసావీ మృతి చెందారు. దీన్ని తీవ్రంగా పరిగణించినట్లు ప్రకటించిన ఐఆర్‌జీసీ.. తగిన మూల్యం తప్పదని హెచ్చరించింది. ఉత్తర ఇరాక్‌లోని ఇర్బిల్‌ నగరంలో అమెరికా కాన్సులేట్‌కు సవిూపంలో ఉన్న మొసాద్‌ ముఖ్య కార్యాలయంపై క్షిపణులను ప్రయోగించింది. ఈ పరిణామాల నడుమే తాజా ఘటన చేసుకుంది.