పశ్చిమ ఏజెన్సీలో రగిలిన భూ వివాదాలు
మర్లగూడెంలో ఉద్రిక్తత
అటవీ అధికారులపై గిరిజనుల దాడి
ఏలూరు, జూలై 29: పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారంనాడు భూ వివాదాలు మళ్లీ తలెత్తాయి. బుట్టాయిగూడ మండలం మర్లగూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ గ్రామంలో అటవీ భూములను ఆక్రమించుకోవడానికి బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాలైన దుద్దుకూరు, రాయన్నపాలెం, వీరన్నపాలెం సహా ఆరు గ్రామాలకు చెందిన గిరిజనులు చేసిన ప్రయత్నాలు ఘర్షణకు దారి తీశాయి. గిరిజనుల ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అటవీ శాఖాధికారులు రంగంలోకి దిగారు. దాంతో గిరిజనులు ఆగ్రహంతో కత్తులతో స్వైరవిహారం చేశారు. పోలీసు బలగాలతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు గిరిజనుల వద్ద కత్తులను లాక్కొనేందుకు చేసిన ప్రయత్నంలో ముగ్గురు అధికారులకు స్వల్ప గాయలయ్యాయి. జిల్లా అటవీ శాఖాధికారి రామకృష్ణ, మరికొందరు అధికారులను గిరిజనులు అటకాయించారు. మర్లగూడెంలో హైటెన్షన్ తలెత్తింది. జంగారెడ్డిగూడెం డిఎస్పీ రామకృష్ణంరాజు, సిఐ మనోజ్‌హర్, బుట్టాయిగూడెం ఎస్సై సత్యనారాయణ, తహశీల్దార్ నర్సింహమూర్తి, మర్లగూడెం చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు గిరిజనులతో చర్చ జరిపారు. వివాదాన్ని పరిష్కరించేందుకు రంగంలో దిగిన కలెక్టర్ వాణీమోహన్ ఆదేశాల మేరకు గిరిజనులతో చర్చలను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు తాత్కాలికంగా సద్దుమణిగాయి. మర్లగూడెంలో పోలీసు ఫికెట్ ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ సత్యనారాయణ వివాదం తలెత్తిన అటవీ భూములను పరిశీలించారు. 144 సెక్షన్ విధించేందుకు ఆదేశించారు. వాస్తవానికి 110 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మర్లగూడెంలోని అటవీ భూములపై హక్కుల పత్రాలను మర్లగూడెం, జైనవారిగూడెం గ్రామాల గిరిజనులకు ఎంతో కాలంగా అధికారులు పంపిణీ చేశారు. ఈ భూముల్లో కొంతభాగం ఆక్రమించేందుకు బుట్టాయిగూడెం మండలంలోని ఆరు గ్రామాల గిరిజనులు రంగప్రవేశం చేయడంతోనే వివాదం తలెత్తింది. పోలవరం ఎమ్మెల్యే బాల్‌రాజు ఈ వివాదంపై అధికారులతో మాట్లాడారు.