పాకిస్తాన్ కి మోడీ మరో షాక్

modiట్లెజ్, బియాస్, రవి నదుల జలాలపై భారత్‌కే హక్కు ఉందని, అందువల్ల ఈ జలాలను వృథాగా పాకిస్తాన్‌లోకి పోనివ్వకుండా నిలిపివేస్తామని, ఇక్కడి రైతులే ఉపయోగించుకునేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘సింధూ జలాల ఒప్పందం- సట్లెజ్, బియాస్, రవి- ఈ నదులలోని జలాలు భారత్‌కు, మన రైతులకే చెందుతాయి. ఈ నీటిని పాకిస్తాన్ పంట పొలాల్లో ఉపయోగించుకోవడం లేదు. అయితే పాకిస్తాన్ మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. ఇప్పుడు ఈ నీటిలో ప్రతి బొట్టును నిలిపివేసి, పంజాబ్, జమ్మూకాశ్మీర్, భారత రైతాంగానికి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పని చేయడానికి నేను నిబద్ధుడినై ఉన్నాను’ అని శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ మోదీ అన్నారు. సట్లెజ్, బియాస్, రవి నదులలోని ప్రతి నీటి బొట్టును పంజాబ్, జమ్మూకాశ్మీర్ రైతులకు అందించేందుకు వీలుగా ఒక టాస్క్ ఫోర్స్‌ను నియమించినట్లు ఆయన వెల్లడించారు. ‘మీ పంట పొలాలకు ఈ నీటిని అందించి మీ అవసరాలు తీర్చడానికి మీ ఆశీస్సులు నాకు అవసరం’ అని మోదీ రైతులను ఉద్దేశించి అన్నారు. పంజాబ్ రైతులకు తగినంత నీరు అందితే వారు మట్టిలో బంగారం పండిస్తారని, దేశ ఖజానాను నింపుతారని మోదీ అన్నారు.