– పోలింగ్ కేంద్రం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ముష్కరుడు
– 31మంది మృతి, 40మందికి పైగా గాయాలు
– పోలీసుల వ్యాన్‌లు లక్ష్యంగా చేసుకొని దాడులు
– చెల్లాచెదరుగా పడిపోయిన శరీరభాగాలు
– క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
ఇస్లామాబాద్, జులై25(జనంసాక్షి) : పాకిస్తాన్‌లో ఉగ్రదాడి జరిగింది.. పోలింగ్ కేంద్రం వద్ద ముష్కరుడు పోలీస్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఆత్మహుతిదాడికి పాల్పడ్డాడు.. దీంతో ఒక్కసారిసారిగా పేలుడు చోటు చేసుకోవటంతో పరిసర ప్రాంతాల్లోని 30మంది మృతి చెందగా, మరో 40మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. కాగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో శరీరభాగాలు చెల్లాచెదరుగా పడి భయానక వాతావరణం నెలకొంది.. ఓ వైపు పాకిస్థాన్‌లో ఎన్నికలు జరుగుతుంటే.. మరోవైపు పోలీసుల వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. క్వెట్టాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ముష్కరులు ఆత్మాహుతి దాడికి దిగారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు పోలీసులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనివ్వకుండా ముష్కరుడిని పోలీసులు అడ్డుకున్న సమయంలో అతడు తనని తాను పేల్చేసుకున్నాడు. పేలుడు కారణంగా ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు పేలుడు కారణంగా భయంతో పరుగులు పెట్టారు. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకున్న బాంబు నిర్వీర్య బృందాలు నిశితంగా పరిశీలించి పేలని గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. పార్లమెంటు(జాతీయ అసెంబ్లీ)లోని 272 స్థానాలకు, నాలుగు రాష్టాల్ర అసెంబ్లీలోని 577 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన 24 గంటల్లోగా ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి ప్రసారాలను చేయొద్దని పాక్ ప్రభుత్వం అన్ని ప్రైవేటు టెలివిజన్ ఛానల్స్‌కు
ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్న పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వసీం అక్రమ్, ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ తదితరులు ఓటు వేశారు.