పాక్‌కు ఝలక్ ఇచ్చిన అగ్రరాజ్యం
– 400 మిలియన్ డాలర్ల కోత విధిస్తూ నిర్ణయం
వాషిగ్టన్, ఆగస్టు17(జనంసాక్షి ) : పాకిస్థాన్‌కు అమెరికా మరో ఝలక్ ఇచ్చింది. పాకిస్థాన్‌తో మెరుగైన భాగస్వామ్య ఒప్పందం 2010 కింద ఆ దేశానికి అందజేయాల్సి ఉన్న ఆర్థిక సాయంలో మరింత కోత విధించింది. అమెరికాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పర్యటించిన మూడు వారాల తర్వాత ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇవ్వడం విశేషం. ఒప్పందం ప్రకారం ఐదేళ్లలో పాకిస్థాన్‌కు అమెరికా 7.5 బిలియన్ డాలర్లు సాయం చెయాల్సి ఉంది. దీనికి సంబంధించిన కెర్రీ లూగార్ బెర్మాన్ (కేఎల్బీ) చట్టానికి 2010 సెప్టెంబరులో అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. కానీ, పాకిస్థాన్ తన భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, వారికి ఆర్థికంగా వనరులు సమకూర్చుతున్నట్టు ఆధారాలు లభించడంతో ఆ సాయాన్ని అగ్రరాజ్యం సగానికి సగం తగ్గించింది. ఇందులో భాగంగా గతేడాది సెప్టెంబరులో సైనిక సహాయం కోసం అందజేయాల్సిన 300 మిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌కు అమెరికా చేసే సాయం 4.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. తాజాగా, ఇందులో మరో 400 మిలియన్ డాలర్లు కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యం నిర్ణయంతో పాక్‌కు అమెరికా చేసే ఆర్థిక సాయం 4.1 బిలియన్ డాలర్లకు తగ్గింది. హక్కానీ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను అడ్డుకోవడంలో పాక్ విఫలమైందని భావించిన అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ గతేడాది జనవరిలోనే బిలియన్ డాలర్లు సాయం నిలిపివేసింది. ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అమెరికాలో పర్యటించినప్పుడు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. పాక్ వైఖరిపై తీవ్రంగా మండిపడిన ట్రంప్, తాము ఏళ్లుగా చేస్తున్న ఆర్థిక సాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏడాదిన్నరలో 1.3 బిలియన్ డాలర్ల సాయాన్ని ఎందుకు నిలిపివేశామో ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కశ్మీర్ వ్యవహారంలో అమెరికా నుంచి పాక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి సమావేశంలో తమకు మద్దతివ్వాలని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఫోన్ ద్వారా సంప్రదించారు. అయితే ఇందుకు నిరాకరించిన ట్రంప్.. ఈ సమస్యను భారత్-పాక్ ద్వైపాక్షికంగా చర్చించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.