పాక్‌,చైనాలకు మింగుడు పడని భారత్‌ వైఖరి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో పలు నిర్మాణాల ద్వారా భారత్‌ను నిలదీయాలన్న చైనా వ్యూహాలకు పాక్‌ సహకరిస్తున్న తీరు, డోక్లామ్‌ వ్యవహారాలు ఇటీవల సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. అయితే గతంలో లాగా కాకుండా భారత్‌ కఠిన వైఖరి అవలంబించడం చైనాకు మింగుడు పడడం లేదు. ఇప్పుడు బ్రిక్స్‌ సదస్సులో పాక్‌ వైఖరిని ప్రపంచ దేశాలు తూర్పారా పట్టాయి. పాక్‌ ఆక్రమించు కొన్న గిల్గిట్‌-బాల్టిస్థాన్‌లలో అణచివేతలను, అక్కడి ప్రజల స్వాంత్య్రాలను ప్రస్తావించడం ద్వారా ప్రధాన మంత్రి మోదీ ఒక్క పాకిస్థాన్‌కే కాదు, ఆ ప్రాంతంలో ఆర్థిక నడవా నిర్మిస్తున్న చైనాకూ హెచ్చరిక జారీ చేసినట్లయింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ వాస్తవంలో భారత భూభాగమే. బలూచిస్థాన్‌ అంశాన్ని దాంతో సమానస్థాయిలో నిలపడం ద్వారా పాక్‌కు నిద్రలేకుండా చేశారు. పాకిస్థాన్‌ను నిలువరించడానికే ఆ అస్త్రం అవసరమైంది. కశ్మీర్‌ అంశాన్ని ఒక కొలిక్కి తేలేమని గ్రహించిన ప్రధాని మోదీ, ఆ ప్రయత్నాల్లో భాగంగానే బలూచిస్థాన్‌, గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ సమస్యల్ని లేవనెత్తారు. తద్వారా, కశ్మీర్‌ విషయంలో భారత్‌ ఇన్నాళ్లూ అనుసరిస్తూ వస్తున్న విధానాన్ని కొత్తమలుపు తిప్పారు. కశ్మీర్‌ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తున్న సయ్యద్‌ అలీ షా గిలానీ, విూర్వాయిజ్‌ ఫరూక్‌, యాసిన్‌ మాలిక్‌ వంటి వారి వ్యవహారాలపై దృష్టి సారించడంతో ఇడికి దొరికిపోయారు. మొత్తంగా గతంలో కన్నా తీవ్రంగా కటువుగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారు. పాక్‌ కాశ్మీర్‌ను అడ్డం పెట్టుకుని గతానుభవాలను మరచి చైనా అండతో కయ్యానికి కాలుదువ్వుతోంది. వరుస పరాభవాలు ఎదురైనా పాక్‌ భారత్‌పై దాడికి తెగిస్తూనే ఉంది. అలాగే పాక్‌నుకూడా పొరుగు దేశంగా క్షమించాల్సిన అవసరం లేదు. అక్కడి పాలకులు ఎవరైనా

ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వారే. అందుకే చాలాకాలం తరవాత భారత్‌ వైఖరిలో మార్పువచ్చింది. మోడీ ఎంతగా స్నేహహస్తం చాచినా వైఖరిలో మార్పు రాలేదు…రాదు కూడా. కాశ్మీర్‌లో వేలుపెడుతూ మన దేశంలో ఉగ్రవాదులకు ఊతమిస్తున్న సంఘటనలు కోకొల్లలు. అలాంటి దేశాన్ని ఉపేక్షించేది లేదని గుర్తించి ఎక్కడిక్కడ ప్రపంచ వేదికలపైన గట్టిగానే హెచ్చరించారు. ఉగ్రవాదానికి వంత పాడుతున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. చైనా దొంగ స్నేహంతో పాక్‌ ఈ మధ్య

రెచ్చిపోతున్న తీరు ఇటీవలి కాశ్మీర్‌ ఘటనలు చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాద చర్యలను ఖండించడం ఒక్కటే సరిపోదని అంటూ వారు ఎక్కడున్నా తుదముట్టించాల్సిందే అన్నదే భారత్‌ వాదనగా ఉంది. అందుకే ప్రధాని మోడీ ఎక్కడా మంచి ఉగ్రవాదులు.. చెడ్డ ఉగ్రవాదులు ఉండరని పేర్కొంటున్నారు. తీవ్రవాదం ఈ ప్రాంతానికి అతిపెద్ద సవాల్‌గా మారిందని చెప్పారు. కాశ్మీర్‌లో వేలుపెట్టిన ప్రతిసారీ తాత్కాలికంగా మనం ఇబ్బంది పడ్డా అంతర్జాతీయంగా పాక్‌ కుట్రలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. ఇకపోతే కశ్మీర్‌ ప్రజలు హింసను విడనాడి జనజీవన స్రవంతిలోకి రావాలి. ఉగ్రమూకల ప్రలోభాలకు లొంగితే భవిష్యత్‌ లేదని గేర్తుంచుకోవాలి. ఇదే సందర్భంలో దేశ విద్రోహ చర్యలకు పాల్పడే వారితో చర్చల ప్రసక్తి లేదని కేంద్రం ఖరాఖండిగా చెబుతూనే ఉంది.

——————-