పాక్‌లో ఉగ్రవాదులున్నారు
– 30వేల నుంచి 40వేల మంది ఉంటారు
– ఉగ్రసంస్థల నిర్వీర్యం కోసం చర్యలు తీసుకుంటున్నాం
– తాలిబన్లతో చర్చల విషయంలో అమెరికాకు సహకరిస్తాం
– పుల్వామా దాడిలో పాక్ ప్రమేయం లేదు
– పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
వాషింగ్టన్, జులై24(జనంసాక్షి) : పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఉన్నారని, 30వేల నుంచి 40వేల మంది వరకు ఉగ్రవాదాలు ఉంటారని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన యునైటెడ్ స్టేట్స్ పీస్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసంగిస్తూ ఈ విషయాలు బయటపెట్టారు. తమ దేశంలో ఇంకా 30వేల నుంచి 40వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని బహిరంగంగా ప్రకటించారు. గత ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్లే వాటి కార్యకలాపాలు హెచ్చువిూరాయన్నారు. ముష్కరులంతా అఫ్ఘనిస్థాన్, కశ్మీర్ ప్రాంతాల్లో శిక్షణ పొంది దాడులకు పాల్పడుతున్నారన్నారు. 2014లో తాలిబన్లు చేసిన దాడిలో దాదాపు 150 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినప్పుడే..దేశంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను ఏమాత్రం అనుమతించొద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు అన్ని పార్టీలు కలిసి కార్యాచరణ రూపొందించాయన్నారు. కానీ చిత్తశుద్ధి లోపించిన గత ప్రభుత్వాలు దాన్ని అమలుచేయలేకపోయాయని తెలిపారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉగ్రసంస్థల నిర్వీర్యం కోసం చర్యలు తీసుకుంటోందని చెప్పుకొచ్చారు. అంతకు ముందు జరిగిన మరో కార్యక్రమంలో దేశంలో దాదాపు 40 ఉగ్రవాద సంస్థలు ఉండేవని ఇమ్రాన్ వెల్లడించారు. వాటి విషయంలో పాక్ ప్రభుత్వం ఎప్పుడూ వాస్తవాలను బహిర్గతం చేయలేదని.. అమెరికాకు అబద్దాలు చెబుతూ వచ్చిందని అంగీకరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేం అమెరికాతో కలిసి యుద్ధం చేశామని, కానీ, పాక్ ప్రభుత్వం అమెరికాకి వాస్తవాలు చెప్పలేదన్నారు. ఎందుకంటే పాక్ గత ప్రభుత్వాలు తమ నియంత్రణలో ఉండేవి కావని, అప్పట్లో దాదాపు 40 ఉగ్రవాద సంస్థలు పాక్ కేంద్రంగా పనిచేస్తున్నాయని, అసలు దేశం ఎలా మనుగడ సాగిస్తుందనే చర్చ జరిగిందని ఇమ్రాన్ అన్నారు. ఉగ్రవాదంపై పోరాడాలని అమెరికా కోరింది. కానీ, మేం మాత్రం మా ఉనికి కోసం పోరాడామని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు షీలా జాక్సన్ ఏర్పాటు చేసిన సభలో ఇమ్రాన్ తెలిపారు. గత కొన్నేళ్లుగా అమెరికా-పాక్ మధ్య సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవని.. ఇకపై వాటి పునరుద్ధరణకు కృషి చేస్తామని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. తాలిబన్లతో చర్చల విషయంలో అమెరికాకు సహకరిస్తామని తెలిపారు.
పుల్వామా దాడిలో పాక్ ప్రమేయం లేదు..
ఐదునెలల క్రితం పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారతీయ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటనపై స్పందించారు. పుల్వామా ఘటనతో తమకెలాంటి ప్రమేయం లేదని, తమను నిందించరాదంటూ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కి చెందిన ఓ యువకుడే ఇందుకు మూలమన్నారు. తమంది భారతీయ రక్షక దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి అతడే కారణమని, కానీ హఠాత్తుగా ఈ విషయంలో పాకిస్థాన్ వెలుగులోకి వచ్చిందని ఇమ్రాన్ పేర్కొన్నారు.