పాక్‌లో దారుణం
ఇస్లామాబాద్,ఆగస్ట్9(జనం సాక్షి): పాకిస్థాన్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఖైబర్ పక్తుంఖ్వా ప్రాంతంలో రేష్మా అనే గాయని, నటి దారుణ హత్యకు గురైంది. ఆమె భర్తే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఏడాది క్రితం రేష్మాకు ఖైబర్ పక్తుంఖ్వా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే అప్పటికే అతను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రేష్మాకు విషయం చెప్పకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల రేష్మాకు ఈ విషయం తెలీడంతో భర్తతో గొడవపడి హకీమాబాద్ ప్రాంతంలో ఉంటున్న తన సోదరుడి నివాసానికి వెళ్లిపోయింది. తనతో కలిసి కాపురం చేయడం లేదని కోపోద్రిక్తుడైన ఆమె భర్త.. హకీమాబాద్‌లో రేష్మా ఉంటున్న ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దాంతో అమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పాక్‌లో గతంలోనూ ఇలాంటి ఘటనలు 14కు పైగా చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో చనిపోయింది నటీమణులు, గాయనిలే కావడం గమనార్హం.