పాక్‌లో భూప్రకంపనలు: 89కి చేరిన క్షతగాత్రుల సంఖ్య

 హైదరాబాద్‌: ఆఫ్ఘనిస్థాన్‌-తజకిస్థాన్‌ సరిహద్దులో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భూకంప ప్రభావం పాకిస్థాన్‌లోనూ చూపించింది. భూకంపం కారణంగా పాకిస్థాన్‌లో భూప్రకంపనలు సంభవించాయి. ప్రకంపనల కారణంగా 89 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. రిక్టర్‌ స్కేలుపై 6.9తీవ్రత నమోదైనట్లు వారు చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌కి 280కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దులో సంభవించిన ఈ భూకంప ప్రభావం పాకిస్థాన్‌తోపాటు, తజకిస్థాన్‌, ఉత్తర భారత్‌లోనూ కనిపించింది. క్షతగాత్రుల్లో 59మంది పెషావర్‌ ప్రాంతానికి చెందిన వారు కాగా.. మరో 30మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. భూకంప భయంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీయడం ద్వారా కొద్ది మందికి స్వల్పగాయాలైనట్లు వారు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని కారకోరమ్‌ రహదారిని అధికారులు మూసివేశారు.