పాక్‌లో రెండు రైళ్లు ఢీ
కనీసం 30మంది మరణించినట్లు సమాచారం
ఇస్లామాబాద్,జూన్7(జనం సాక్షి): పాకిస్తాన్‌లోని ఘోట్కిలో రెండు రైళ్లు ఢీకొనడంతో 30 మంది వరకూ మృతి చెందారని ప్రాథమికంగా తెలుస్తోంది. విూడియాకు అందిన సమాచారం ప్రకారం సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు రెతి, డహార్కి మధ్య మిల్లత్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 40 నుంచి 50 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం గురించి సింధ్‌లోని ఘోట్కి జిల్లా పోలీసు అధికారి ఉస్మాన్ అబ్దుల్లా మాట్లాడుతూ మిల్లత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొన్నదని తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారిని సవిూపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. ’రేడియో పాకిస్తాన్’ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులను సవిూప ఆస్పత్రులకు తరలించారు. బోగీల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి సహాయ కార్యక్రమాలు ప్రారంభించినట్లు రేడియో పాకిస్తాన్ చెప్పింది. మిల్లత్ ఎక్స్‌ప్రెస్‌లోని 8 బోగీలు, సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ఘోట్కీ సవిూపంలో డహర్కీ, రేతీ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ప్రమాదం తర్వాత ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ఈ ఘటనలో కనీసం 40 మంది గాయపడ్డారని, ఘోట్కీ ఎస్‌ఎస్పీ వివరాల ప్రకారం 30 మంది వరకూ ప్రయాణికులు చనిపోయారని ఘోట్కీ డిప్యూటీ కమిషనర్ ఉస్మాన్ అబ్దుల్లా జియో న్యూస్‌కు చెప్పారు. సహాయ కార్యక్రమాల కోసం అవసరమైన భారీ యంత్రాలను ఘటనాస్థలం దగ్గరకు పంపించామని, అవి త్వరలో అక్కడికి చేరుకుంటాయని ఆయన తెలిపారు.