పాక్ అసెంబ్లీకి హిందూ అభ్యర్తి ఎన్నిక
16 ఏళ్లలో ఇదే తొలిసారి
ఇస్లామాబాద్,జూలై28(జనం సాక్షి): పాక్ జాతీయ అసెంబ్లీకి జనరల్ స్థానంనుంచి ఒక హిందూ అభ్యర్థి ఎన్నికయి చరిత్ర సృష్టించారు. పాకిస్తాన్‌లో ముస్లిమేతరులకు ఓటు హక్కుతో పాటుగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు హక్కు కల్పించిన 16 ఏళ్లకు తొలిసారిగా అతను ఎన్నిక కావడం విశేషం. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి)కి చెందిన మహేశ్‌కుమార్ మలాని ఈ ఘనత సాధించారు. ఇటీవల జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సింధ్ రాష్ట్రంలోని థార్‌పర్కార్ 2 స్థానంనుంచి పిపిపి తరఫున పోటీ చేసి గెలుపొందారు. 14 మంది ప్రత్యర్థులను ఓడించి ఘనవిజయం సాధించారని ‘డాన్ ‘పత్రిక తెలిపింది. మలానికి 1,06,630 ఓట్లు రాగా, ఆయన సవిూప ప్రత్యర్థి,గ్రాండ్ డెమోక్రటిక్ అలయెన్స్‌కు చెందిన అర్బాబ్ జకావుల్లాకు 87,251ఓట్లు వచ్చాయి. పాక్‌లో హిందూ రాజస్థానీ పుష్కర్ణ బ్రాహ్మణుడైన మలాని గతంలో 2003-08 మధ్యకాలంలో రిజర్వ్‌డ్ స్థానంనుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అప్పుడు పిపిపి ఆయనను నామినేట్ చేసింది. 2013లో సింధ్ రాష్ట్ర అసెంబ్లీకి థార్‌పర్కార్ అసెంబ్లీ స్థానంనుంచి ఎన్నికయి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయిన తొలి ముస్‌ల్లిమేతర అభ్యర్థి అయ్యారు. సింధ్ అసెంబ్లీలో ఆహార స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌గా కూడా ఆయన పని చేశారు. పలు స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా పని చేశారు. రాజకీయంగా ఇది మైనార్టీలకు బలం చేకూర్చేదన్నారు.