పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా రోడ్డు

భారత్‌ అభ్యంతరాలను తోసిపుచ్చిన పాక్‌, చైనా

న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): చైనా, పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా రెండు దేశాల మధ్య బస్సు

సర్వీస్‌ను ప్రారంభించడంపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ విూదుగా ఈ బస్సు వెళ్తుండటంపై ఇండియా తన నిరసన తెలిపింది. ఇది కచ్చితంగా తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇండియా స్పష్టం చేసింది. అయితే ఇండియా వాదనలను చైనా, పాకిస్థాన్‌ ఖండించాయి. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుబట్టేలా ఇండియా వ్యవహరిస్తున్నదని పాకిస్థాన్‌ విమర్శించింది. భారత విదేశాంగ శాఖ నిరసన, ప్రకటనను మేం ఖండిస్తున్నాం. పదేపదే కశ్మీర్‌ తమది అన్న ఇండియా వాదన చరిత్రలోని వాస్తవాలను, జమ్ముకశ్మీర్‌ చట్టబద్ధతను మార్చదని పాక్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అసలు మొత్తం జమ్ముకశ్మీర్‌ రాష్ట్రమే వివాదంలో ఉన్నదని పాక్‌ స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌ అంశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్లెబిసైట్‌ నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది. అటు చైనా కూడా ఇండియా అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఎకనమిక్‌ కారిడార్‌ ఓ ఆర్థిక సహకారమే తప్ప ఏ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నది కాదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కాంగ్‌ చెప్పారు.