పాక్ ఆర్టీ చీఫ్ అనూహ్య నిర్ణయం
జిన్‌పింగ్ భారత్ పర్యటన నేపథ్యంలో చైనా పర్యటన
బీజింగ్,అక్టోబర్9 (జనం సాక్షి): పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడి మిలటరీ ఉన్నతాధికారులతో సమావేశమై విస్తృత చర్చలు జరిపారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అధికారిక పర్యటన కోసం భారత్‌కు రావాల్సి ఉండగా.. దానికి కొద్ది రోజుల ముందే జనరల్ బజ్వా చైనా పర్యటనకు వెళ్లడం గమనార్హం. స్థానిక విూడియా కథనం ప్రకారం.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)ఉన్నతాధికారులతో బజ్వా జమ్మూ కశ్మీర్ పరిస్థితిపైనా, అక్కడ భారత్ చేపట్టిన భద్రతా ఏర్పాట్ల పైనే ప్రధానంగా చర్చలు జరిపారు. పీఎల్‌ఏ ప్రధాన కార్యాలయంలో పీఎల్‌ఏ కమాండర్ ఆర్మీ జనరల్ హాన్ విగువో, సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) వైస్ చైర్మన్ జనరల్ జు ఖిలియాంగ్ తదితరులతో సమావేశమైన బజ్వా.. కశ్మీర్ అంశాన్ని ప్రముఖంగా లేవనెత్తినట్టు బీజింగ్ అధికారులు ధ్రువీకరించారు.చైనా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు జనరల్ బజ్వా కూడా వెళ్లారు. సీపీఈసీ ప్రాజెక్టుపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో పాక్ ప్రధాని ఇమ్రాన్ చర్చలు జరపనున్నారు. కాగా జనరల్ బజ్వా, పీఎల్‌ఏ అధికారుల సమావేశం నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ స్పందించింది. జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై పాకిస్తాన్ ఆందోళనను చైనా ఆర్మీ గుర్తించినట్టు చెప్పుకొచ్చింది. కాగా కశ్మీర్‌కి సంబంధించి ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను భారత్ గుర్తించి, అమలు చేసినప్పుడే కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పీఎల్‌ఏ అధికారులతో జనరల్ బజ్వా చెప్పినట్టు పాక్ ఆర్మీ విూడియా ఐఎస్‌పీఆర్ వెల్లడించింది.