పాక్‌ క్రికెట్‌కు తక్షణ పరిష్కారాల్లేవు: ముదస్సార్‌ నాజర్‌


కరాచి: పాకిస్థాన్‌ క్రికెట్‌ సమస్యలకు తక్షణ పరిష్కారాలేమీ లేవని పాక్‌ క్రికెట్‌ అకాడమీ కొత్త డైరెక్టర్‌ ముదస్సార్‌ నాజర్‌ అన్నారు. స్వదేశంలోని క్రికెట్‌ అభివృద్ధి కోసం ఆయన దుబాయ్‌లోని ఐసీసీ గ్లోబల్‌ అకాడమీలో కీలక పదవిని వదిలేసి పీసీబీలో చేరారు. ‘దేశంలో యువ ప్రతిభ చాలా ఉంది. యువకులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు కావాల్సిందల్లా జాతీయ క్రికెట్‌ అకాడమీ, ప్రాంతీయ అకాడమీలను మరింత ఉత్పాదకరంగా, సమర్థవంతంగా మార్చడమే’ అని ఆయన అన్నారు. దేశంలో క్రికెట్‌ స్థిరీకరణకు 6-8 ఏళ్లు పడుతుందని ఇందుకు తక్షణ పరిష్కారాలు లేవని చెప్పారు.

‘దేశవాలీ క్రికెట్‌లో చేయాల్సిన పని చాలా ఉంది. అందుకే సవాల్‌తో కూడుకున్న ఈ పనిని ఎంచుకున్నా. స్వదేశంలోని పిచ్‌లు, దేశవాలీ క్రికెట్‌ విధానాన్ని మెరుగుపరచాలి. నాణ్యమైన బంతుల్ని వినియోగించాల్సి వుంది. అన్ని దేశాల జాతీయ జట్లలో సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగించడం పెరిగిన తరుణంలో మేము యువకులపై దృష్టి కేంద్రీకరించాల్సి వుంది. దురదృష్టవశాత్తు వనరులన్నీ వృథా అయ్యాయని, మళ్లీ సేకరించాలని’ నజార్‌ అన్నారు. ఆయనకు పాకిస్థాన్‌ సీనియర్‌, ఏ జట్టుకు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది.