పాక్ ప్రధానిగా..
ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకారం
– ఇమ్రాన్‌చే ప్రమాణం చేయించిన అధ్యక్షుడు మామూన్ హుస్సేన్
ఇస్లామాబాద్, ఆగస్టు18(జనం సాక్షి) : పాకిస్థాన్ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఆ దేశ అధ్యక్షుడు మామూన్ హుస్సేన్ ఇమ్రాన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్షుడి అధికారిక నివాసంలో ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం పాక్ జాతీయ గీతంతో ప్రారంభమైంది. తర్వాత ఖురాన్‌లోని వాక్యాలను చదివారు. నలుపు రంగు షేర్వాణిలో వచ్చిన ఇమ్రాన్ ఉర్దూలో ప్రమాణం చేశారు. అయితే ఆయన ప్రమాణస్వీకారం సమయంలో కాస్త ఆందోళనగా కనిపించారు. కొన్ని ఉర్దూ పదాలు పలకలేక ఇబ్బందిపడ్డారు. ఇమ్రాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన భార్య బుష్రా ఇమ్రాన్, ఆర్మీచీఫ్ జనరల్ కమార్ జావేద్ భజ్వా, ఎయిర్ చీఫ్ మార్షల్ ముజాహిద్ అన్వార్ ఖాన్, నావెల్ చీఫ్ అడ్మిరల్ జాఫర్ మహముద్ అబ్బాసీతో పాటు భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, రవిూజ్ రాజా, వసీం అక్రం, గాయకులు సల్మాన్ అహ్మద్, అబ్రూల్ హక్, నటుడు జావిద్ షేక్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని పదవికి పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీ అభ్యర్థి షాబాజ్ షరీఫ్ నామినేషన్లు దాఖలు చేశారు. స్పీకర్ అసద్ ఖైజర్ శుక్రవారం ఎన్నిక నిర్వహించగా.. దిగువ సభలోని మొత్తం 342 మంది సభ్యులకుగాను 272 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇమ్రాన్‌ఖాన్ 176 ఓట్లు సాధించగా.. ప్రత్యర్థి అభ్యర్థి షాబాజ్ షరీఫ్‌కు కేవలం 96 ఓట్లు వచ్చాయి. ప్రధాని పీఠంపై కూర్చోవడానికి 172 ఓట్లు పొందాల్సి ఉండగా.. ఇమ్రాన్‌ఖాన్ నాలుగు ఓట్లు అధికంగా పొందారు. ఈ ఎన్నికలో విజయం సాధించిన ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.