పాక్ హెచ్‌బీఎల్ బ్యాంక్‌కు అమెరికా చెక్
న్యూయార్క్,సెప్టెంబర్8(జనంసాక్షి): పాకిస్తాన్ అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ‘హబీమ్ బ్యాంక్ లిమిటెడ్’ హెచ్‌బీఎల్‌కు అమెరికా చెక్ పెట్టింది. న్యూయార్క్‌లోని ఈ బ్యాంకు కార్యాలయానికి తాళమేసింది. తీవ్రవాదులకు నిధులు సమకూర్చడం, మనీ ల్యాండరింగ్ తదితర ఆరోపణలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం న్యూయార్క్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (డీఎఫ్‌ఎస్) ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్ చట్టాలను అతిక్రమించి అక్రమ లావాదేవీలు నిర్వహించినందుకు 225 మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.14.3 వందల కోట్లు. కాగా తొలుత డీఎఫ్‌ఎస్ 629.6 మిలియన్ డాలర్ల జరిమానా విధించడం గమనార్హం. సౌదీ ప్రయివేటు బ్యాంకు అల్ రాజ్హి బ్యాంకుతో హెచ్‌బీఎల్ బిలియన్ల డాలర్ల మేర లావాదేవీలు నిర్వహించినట్టు డీఎఫ్‌ఎస్ దర్యాప్తులో తేలింది. అల్ రాజ్హి బ్యాంకు తీవ్రవాద సంస్థ అల్‌ఖయిదాతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో ఉగ్రవాదులకు నిధులు సమకూరుతున్నాయని గ్రహించారు. ఈ మేరకు విచారణ జరిపి మూసివేతకు ఆదేశించారు.