పాఠశాలల్లో స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహా వేడుకలు నిర్వహించాలి

-డి. ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై.

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్5(జనంసాక్షి)

మహబూబాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 8 నుండి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహా వేడుకలు నిర్వహించాలని మహబూబాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి ఎం.డి. అబ్దుల్ హై తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆజాదికా అమృత్ మహోత్సవం కార్యక్రమానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 8 నుండి 22 వరకు “స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలు” జరుపుటకు నిర్ణయించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సారం జిల్లా స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సూచించిన విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. ఈ నెల 8న ప్రారంభ కార్యక్రమం, 10న దేశభక్తి గీతాలపై పాటల పోటీలు, వజ్రోత్సవ వన మహోత్సవం, 11న వ్యాస రచన పోటీలు, 12న పాఠశాల స్థాయి ఆటల పోటీలు (ఫ్రీడమ్ కప్), 15న ప్రభాత భేరి, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణ పోటీలు, జాతీయ పతాకావిష్కరణ, స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై సమావేశం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, 16న ఉపన్యాస పోటీలు, సామూహిక జాతీయ గీతాలాపన, 17న చిత్రలేఖనం పోటీలు, 18న జాతీయ భావం ఉట్టిపడేలా ఏకపాత్రభినయ పోటీలు, మండల స్థాయిలో ఆటల పోటీలు (ఫ్రీడమ్ కప్), 19న జాతీయ భావం ఉట్టిపడేలా ముగ్గుల పోటీలు, మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన ఉపాధ్యాయులకు కవితా రచనా పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహణ, 22న ముగింపు సమావేశం, పాఠశాల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతి ప్రదానం కార్యక్రమాలు నిర్వహించాలని డి.ఈ. ఓ తెలిపారు.