పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ అత్యుత్సాహం
– వంద మందికిపైగా ఉపాధి కోల్పోయే ప్రయత్నం
– తన స్వార్థం కోసమే ఇలా చేశాడంటూ విమర్శలు
చండ్రుగొండ జనం సాక్షి (ఆగస్టు 25) : వంద మంది జీవనోపాధి కోల్పోయిన పర్వాలేదు కానీ తాను అనుకున్నది సాధించాలనుకున్నాడో ఏమో ఓ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఏకంగా జిల్లా కలెక్టర్ కు కంప్లైంట్ చేశాడు ఇప్పుడు అదే కంప్లైంట్ వంద మంది అమాయక కుటుంబాల బ్రతుకులు ప్రశ్నార్ధకంగా మారేందుకు కారణం కానుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.మండల కేంద్రమైన చండ్రుగొండ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి పాఠశాల ప్రహరీ గోడకు బయట ఉన్న ఆటో స్టాండ్,పార్టీ దిమ్మెలు, డబ్బా దుకాణాలు చికెన్ షాపు వల్ల బడి లో చదివే పిల్లలకు ఇబ్బంది అవుతుందని సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇటీవలే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు స్పందించిన కలెక్టర్ సమస్యను పరిశీలించాల్సిందిగా గ్రామ పంచాయతీ అధికారులకు ఆదేశాలు పంపారు. ఈ మేరకు మండల పంచాయతీ అధికారి తోట తులసీరామ్,పంచాయతీ సెక్రటరీ పరిశీలనకు వచ్చారు. ఫిర్యాదు కు భిన్నంగా ఉన్నా పరిస్థితులను గమనించి ఏళ్ల తరబడి వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులు ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. అధికారుల రాకను గమనించిన బాధితులు సుమారు 100 మంది అధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గత 40 ఏళ్లుగా ఆటో స్టాండ్ ఇక్కడే ఉందని ఏళ్ల తరబడి ఆటోలు నడుపుతూ వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని ఎప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తలేదని దీనిపై తమకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను వేడుకున్నారు.
* ఫిర్యాదుకు గల కారణమేంటి..?
ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ పదవిలో ఉన్న సదరు వ్యక్తి వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ కావడంతో ఆటో స్టాండ్ లో సభ్యత్వం ఇవ్వలేదన్న కోపంతో ఇలా చేశాడంటూ స్వయంగా ఆటోడ్రైవర్లే ఆరోపించారు. గతంలో స్కూల్ గోడ పూర్తిగా నేలమట్టమై ఉన్నప్పుడు లేని సమస్య గోడ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎందుకు వస్తుందని ఇదంతా కావాలనే చేసినట్లు గ్రామస్థులు చెప్పుకుంటున్నారు.బడి బాగు కోసం పరితపించే చైర్మన్ వర్షం వస్తే బడిలో మోకాళ్ల లోతు నీళ్లు ఆగి ఉన్నప్పుడు పిల్లలకు ఇబ్బంది కాలేదా…? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులే ప్రశ్నించడం గమనార్హం తన స్వార్థం కోసం ఇతరుల పొట్ట కొట్టే ప్రయత్నాలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు గుప్పుమన్నాయి.