పాఠాలుచెప్పని పలుకుబడి టీచర్లు?

పైరవీలతో విధులకు దూరంగా కొందరు
అనంతపురం,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : కొందరు టీచర్లు తమకున్న పలుకుబడి ఉపయోగించి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో డెప్యుటేషన్‌పై పాఠశాలలు వదిలి కార్యాలయాలకు అతుక్కుపోతున్నారు. అవసరం లేనిచోట కూడా ఇబ్బడి ముబ్బడిగా చేరి రెండు రోజులు డ్యూటీలో ఉంటూ మరో రెండు రోజులు సొంత వ్యాపకాల్లో మునిగితేలుతున్నారు. మరి కొందరు టీచర్లు ఏకంగా డ్యూటీకి డుమ్మాకొడుతున్నారు. రోజుల తరబడి పాఠశాల విధులు దూరంగా ఉంటున్నారు. కొందరయితే నెలల తరబడి, మరికొందరు ఏళ్ల తరబడి
పాఠశాలలకు వెళ్లిన దాఖలాలు లేవు.  కొందరు హెచ్‌ఎంలు, ఎంఈఓలతో కుమ్మక్కై జీతంలో కొంత మొత్తం ముట్టజెప్పి.. విధులకు ఎగనామం పెడుతున్నారు. ఇలాంటి వారు జిల్లాలో వందల సంఖ్యలోనే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.  మరోవైపు డెప్యుటేషన్‌ పేరుతో సుమారు 40 మంది వరకు టీచర్లు స్కూళ్లకు దూరంగా ఉన్నారు. వీరిలో చాలామంది అవసరం లేకపోయినా పోస్టుల్లో కొనసాగుతున్నారు.
కొందరు ఉపాధ్యాయులకు నగరంలోని సైన్స్‌ సెంటర్‌ విడిది కేంద్రంగా మారిందనే విమర్శలున్నాయి. పెద్దగా అవసరం లేకపోయినా.. పైరవీలతో అక్కడ విధుల్లో చేరిన ఉపాధ్యాయులు ఆటవిడుపులా గడుపుతున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల నుంచి సిఫార్సు లేఖలు తీసుకుని.. సైన్స్‌ సెంటర్‌లో డ్యూటీ వేయించుకుని పలువురు ఉపాధ్యాయులు పాఠశాలలకు దూరంగా ఉంటూ..ఏళ్ల తరబడి అక్కడే కొనసాగుతున్నారనే విమర్శలున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్లయిన వీరి సేవలు ఉన్నతపాఠశాలల్లో చాలా అవసరం. అయితే విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం పైరవీలకు తలొగ్గడంతో ప్రస్తుతం కొందరు ఉపాధ్యాయులకు పునరావాస కేంద్రంగా సైన్స్‌ సెంటర్‌ మారిపోయింది. కొందరు ఉపాధ్యాయులయితే బాగానే పనిచేస్తున్నారు. సొంత ఖర్చులు పెట్టి పిల్లలకు పుస్తకాలు, ఇతర మెటీరియల్‌ ఇప్పించి చదువులు చెప్పేవారూ ఉన్నారు. వీరి కథ అటు ఉంచితే.. బడి డ్యూటీకి దూరంగా ఉంటున్న వారు కూడా వందల సంఖ్యలో ఉన్నారు. రియల్‌ ఎస్టేట్‌, చిట్‌ఫండ్స్‌, వడ్డీ వ్యాపారం తదితర వ్యాపకాల్లో ఉంటూ పాఠశాలలకు దూరంగా ఉండే వారు చాలామందే ఉన్నారు. కొందరయితే నెలల తరబడి పాఠశాల ముఖం చూడని వారున్నారు. కొందరయితే ఎంఈఓలు, హెచ్‌ఎంలకు ముడుపులిచ్చుకుని మరీ స్కూళ్లకు డుమ్మా కొడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.  జిల్లాకు కొత్త డీఈఓగా శామ్యూల్‌ నియమితులయ్యారు. ఉపాధ్యాయుల పైరవీలకు గతంలో కొందరు ఉన్నతాధికారులు తలొగ్గారనే విమర్శలున్నాయి. ఎవరైనా స్కూల్‌ విజిట్‌కు వెళ్లిన సందర్భాల్లో అక్కడ ఉపాధ్యాయులు గైర్హాజరై ఉంటే.. సంఘాల నేతలు ఆ విషయం చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకునే వారు కాదనే విమర్శలున్నాయి.