పాడిగేదెల పథకంపై రైతుల్లో అనాసక్తి
ముందుకు రాలేకపోతున్న పాడిరైతులు
జగిత్యాల,జూలై23(జనంసాక్షి): పాడిగేదెల పథకం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. పాడిగేదెల ధర అధికంగా ఉండటంతోనే రైతులు వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పాడి రైతులకు ప్రభుత్వం చేయూతనందించాలని నిర్ణయించి ఏడాది కావస్తున్నా లక్ష్యం దిశగా పయనించడం లేదు. సబ్సిడీపై పాడి గేదెలు అందిస్తున్నప్పటికీ రైతులు మాత్రం విముఖత చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం సబ్సిడీపై, బీసీ రైతులకు 50 శాతం సబ్సిడీపై గేదెలు అందిస్తున్నా అధికారులు ప్రచారంలో విఫల మయ్యారు. దీంతోజిల్లాలో లబ్దిదారులకు పాడి గేదెలు అందించాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 1848 మందికి మాత్రమే అందించారు. జగిత్యాల జిల్లాలో పాడిగేదెల పథకం కింద 15,390 మందికి పాడిగేదెలు అందించాలని లక్ష్యంగా నిర్ణయిం చారు. ఇప్పటివరకు కేవలం 1848 మందికి మాత్రమే పాడిగేదెలు పంపిణీ చేశారు. మొత్తం జిల్లాలో 13,390 మంది పాడి రైతులు ఉన్నట్లు గుర్తించగా, గ్రామ స్థాయిలో కరీంనగర్ డెయి రీ, విజయ డెయిరీ వారు సర్వే చేసి పేర్లను నమోదు చేశారు. లక్ష్యంలో కేవలం 12 శాతం మేరకు కూడా పాడిగేదెలు పంపిణీ కాలేదు. అధికారులు ఈ పథకంపై ప్రచా రం కల్పించకపోవడంతోనే రైతులెవరూ ముందుకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒకటి, రెండు పాడి గేదెలు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులు మరో పాడి గేదెను కొనుగోలు చేసుకున్నా పశుగ్రాసానికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనతో ఆసక్తి కనబరచడం లేదు. అయితే పాడిగేదెల ధర మార్కెట్‌లో నిజానికి తక్కువగా ఉండటంతో రైతులెవరూ మొగ్గు చూపడం లేదు. పాడి గేదెల ఖరీదు బయట మార్కెట్‌లోనే రూ.50 వేల నుంచి రూ.60 వేలు ఉండగా, ప్రభుత్వం దానిని రూ.80 వేలు ధరగా నిర్ణయించి అందిస్తుండటంతో బీసీ రైతులకు ఎలాంటి లాభం లేకుండాపోయింది. దీంతో రైతులెవరూ మొగ్గు చూపడం లేదు. జిల్లాలో అర్హులైన పాడి రైతులకు
ఆవులు, గేదెలు పంపిణీ చేస్తామని పశుసంవర్థక శాఖ అధికారి తెలిపారు.