పాడిపశువులకు దాణా కొరత
గ్రాసం కోసం ఎదురుచూపు
చిత్తూరు,మార్చి7(జనం సాక్షి): పాలఉత్పత్తిలో జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో వుంది. అయితే దానికి తగ్గట్టుగా పాడి పశువులకు పశుగ్రాసం అందడం ఇబ్బందిగా ఉంది. జిల్లాలో పాడి రైతుకు అప్పుడే కష్టకాలం మొదలైంది. మార్చి ప్రారంభంలోనే ఎండుగడ్డికి కొరత ఏర్పడడంతో నాలుగైదు నెలల పరిస్థితి ఎలా ఉంటుందో అని పాడిరైతులకు ఆందోళన కల్గిస్తోంది. మార్చి నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ఎండుగడ్డి కూడా దొరకని పరిస్థితి ఎదురవుతుంటుంది. రానున్న 90 రోజులకు అంటే
మార్చి నుంచి మే నెలాఖరు వరకు పశుగ్రాసం అవసరం. పశుగ్రాసం కొరత తీర్చడానికిగాను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అమలు చేసిన పథకాలన్నీ ప్రస్తుతం అమలులో వున్నా నామమాత్రంగానే కొనసాగుతునాయి. పడమటి మండలాల్లో పశుగ్రాసం కొరత తీవ్రంగా వుంది. దాంతో తూర్పు ప్రాంతానికి చెందిన శ్రీకాళహస్తి, ఏర్పేడు, బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెం తదితర మండలాలనుంచి ఎండుగడ్డిని లారీలు, ట్రాక్టర్లలో తెచ్చుకుంటున్నారు. అక్కడి వ్యాపారులు పడమటి మండలాలకు తీసుకొచ్చి ఒక ట్రాక్టరు ఎండుగడ్డి అమ్ముకుంటున్నారు. పూతలపట్టు మండలంలోని రంగంపేట క్రాస్, పాకాల మండలంలోని నేండ్రగుంట తదితర ప్రాంతాల్లో రోజుకు 20 నుంచి 25 లోడ్ల ఎండుగడ్డి విక్రయిం చేస్తున్నారు. జిల్లాలో పశుగ్రాసం కొరతను తీర్చేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలో పశువులకు అవసరమైన వరిగడ్డి, పచ్చిగడ్డికి ప్రత్యామ్నాయంగా పాతరగడ్డి, దాణామృతం రాయితీపై పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.