పాడి పరిశ్రమాభివృద్ధికి కృషి
ఆదిలాబాద్,ఫిబ్రవరి7(జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీలను అభివృద్ధి పథంలోకి తీసుకవస్తానని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోకా భూమారెడ్డి అన్నారు. ప్రజలకు స్వచ్చమైన, నాణ్యతతో కూడిన పాలను అందించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం విజయ డెయిరీలను నెలకొల్పిందన్నారు. జిల్లాలో పాడి రైతులకు ఇన్సెంటీవ్ చెల్లించామని అన్నారు. డెయిరీ అభివృద్ధికి సహకరించాలని జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం, డైరెక్టర్లు కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోనే టీఆర్ఎస్లోకి రాష్ట్రవ్యాప్తంగా భారీగా చేరికలు కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ 45 ఏండ్లు , టీడీపీ 20 ఏండ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేవిూ లేదన్నారు. ఎన్నోఏళ్లుగా జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ మూడున్నర సంవత్సరాల్లో చేసి చూపెట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టుకు రూ.1227కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారన్నారు. చెనాక-కొర్ట పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలుచేశారన్నారు. జిల్లాలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదన సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉందన్నారు.రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.