పాతబస్తీలో యువకుడి దారుణహత్య
మరో వ్యక్తి హత్యకేసులో నిందితుల గుర్తింపు
హైదరాబాద్,నవంబర్25 (జనంసాక్షి) : హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. గౌస్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే వెల్డింగ్ వ్యాపార పనులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతున్న మహ్మద్ అహ్మద్(42)ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కామాటిపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో పలు విషయాలు వెలుగు చూశాయి. కామాటిపుర పరిధిలోని మక్కా కాలనీలో నివసిస్తూ ఇంటికి సవిూపంలోనే వెల్డింగ్ వ్యాపారం నిర్వహిస్తున్న మహ్మద్ అహ్మద్‌కు కొన్నేండ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. అయితే అహ్మద్ అదే ప్రాంతంలో నివసించే ఆరీఫ్ సోదరిపై మనస్సుపడ్డాడు. విషయాన్ని గుర్తించిన ఆరీఫ్ అహ్మద్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినా అహ్మద్‌లో ఎలాంటి మార్పు రాలేదుకదా సదరు మహిళతో మరింత దగ్గరయ్యాడు. దీంతో అహ్మద్‌పై ఆరీఫ్ కక్ష పెంచుకొని ఎలాగైనా అహ్మద్‌ను అడ్డు తొలగించాలని పధకం రచించి స్నేహితుల సహకారం తీసుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తున్న ఆరీఫ్ అహ్మద్ తన దుకాణంలో ఒక్కడే ఉన్నాడని గుర్తించాడు. వెంటనే స్నేహితులతో అహ్మద్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అహ్మద్‌ను హత్య చేసి పరారైన నిందితుల కదలికలపై కన్నేసిన పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. సోమవారం అహ్మద్ హత్య కేసులో నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు సమాచారం.