పాత పెన్షన్ పునరుద్దరించాలి
నిజామాబాద్,మే26(జనం సాక్షి): ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దు చేయాలని ఎస్టీయూ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం ఆరోగ్యకార్డుల చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య సేవలు పొందేందుకు నెలసరి ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కామన్‌సర్వీస్ నిబంధనల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ తీసుకురావడంలో కూడా తాత్సారం చేస్తున్నారని, ఫలితంగా ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.