పాత ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు: మాజీ ఎంపి పొన్నం

కరీంనగర్‌,మే4(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రారంభించినవేనని, ఇందులో పేర్లు మారాయి తప్ప కొత్తవేవిూ లేవని కరీంనగర్‌  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేసి మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారని విమర్శించారు. రీ డిజైన్‌ పేరుతో వేలకోట్లు తగలేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం ఒక్క మెదక్‌ జిల్లాను తప్ప మిగిలిన ఏ జిల్లాను కూడా పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్ల పాలనలో కరీంనగర్‌ జిల్లాకు చేసింది శూన్యమని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయకుండా కేవలం తన మార్కు చూపించాలని తాపత్రయపడుతున్నారని అన్నారు. మెదక్‌కు నీళ్లు తరలించేకార్యక్రమంలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును ఎత్తుకున్నారని అన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా మేడిగడ్డకు శంకుస్థాపన ఎలా చేస్తారని  పొన్నం ప్రశ్నించారు. శంకుస్థాపన రోజే విగ్రహాలు తయారు చేసుకుంటున్నారని తెలంగాణ, ఏపీలో ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని పొన్నం విమర్శించారు. తెలంగాణ హక్కులపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ తప్ప కేసీఆర్‌ చేసిందేవిూ లేదని  పొన్నం వ్యాఖ్యనించారు