పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ తండ్రి మృతి
వాషింగ్‌టన్, జూన్28(జనం సాక్షి) : పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ తండ్రి జోయ్ జాక్సన్ (89) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. పాంక్రియాటిక్ కేన్సర్‌తో కొన్నాళ్లుగా బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే కన్నుమూసినట్టు జోయ్ మనవళ్లు రాండీ జాక్సన్ జూనియర్, టై జాక్సన్‌లు ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. మైకేల్ జాక్సన్‌కి మేనేజర్‌గా వ్యవహరిస్తూ ఆయనని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన జోయ్ జాక్సన్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జోయ్ మృతితో ‘జాక్సన్’ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులతోపాటు పలువురు సెలబ్రిటీలు సైతం జోయ్ మృతికి సంతాపం ప్రకటించారు. జోయ్ జాక్సన్ 1928 జూలై 26న అమెరికాలోని అర్కన్‌సస్‌లోని ఫౌంటెన్‌హిల్స్‌లో జన్మించారు. ఆయన భార్య పేరు కేథరిన్ (88) . వీరికి 11 మంది సంతానం కాగా, పుట్టగానే ఓ బిడ్డ చనిపోయారు. మైకేల్ జాక్సన్ 8వ సంతానం. పిల్లలలో మ్యూజిక్ టాలెంట్‌ని గుర్తించిన జోయ్ అప్పట్లో వారిని ఆ రంగం వైపు బాగా ప్రోత్సహించాడు. జోయ్ చిన్న కూతురు జానెట్ జాక్సన్ (52) కూడా పాప్ సింగరే. పిల్లలని ఎంతో క్షమశిక్షణతో పెంచిన జోయ్ వారిని పాప్ రారాజులుగా తయారు చేశారు. ఎన్నో అవార్డులు కూడా జోయ్‌ని వరించాయి. జోయ్ తనయుడు మైకేల్ జాక్సన్ (50) 2009, జూన్ 25వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.