పామాయిల్‌ రైతులకు మంచి రోజులు

అంతర్జాతీయ పరిణామాలతో పెరుగుతున్న డిమాండ్‌
కాకినాడ,జూన్‌10(జ‌నంసాక్షి): రష్యా`ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, థాయ్‌లాండ్‌ దేశం పామాయిల్‌ ఎగమతులను నిషేధించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయిల్‌పామ్‌కు మహర్దశ పట్టింది. మరోమారు ఇప్పుడు రైతులు పామాయిల్‌ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు పెరగడంతో ఇప్పుడు దేశీయంగగా నూనె ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో 3.86లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు అవుతూ ప్రథమస్థానంలో ఉండగా ఆ తర్వాత 81వేల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ద్వితీయస్థానంలో ఉంది. ఎకరాకు 9నుంచి 10 టన్నుల చొప్పున ఏటా 81వేల టన్నుల మేర పామాయిల్‌ గెలలు దిగుబడి అవుతాయని రైతు వర్గాలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఉత్తర్వులు ఇవ్వని కారణంగా తాము చెల్లించలేదని, అయినప్పటికీ ఈ ప్రాంత పామాయిల్‌ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూ.22,521 చొప్పున ధరలను రైతులకు బకాయిలతో సహా చెల్లించగలమని సామర్లకోట ఏడీబీ రోడ్డులో ఉన్న రుచిసోయా సంస్ధ యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నట్లు జిల్లా పామాయిల్‌ రైతు సంఘ నాయకులు తెలిపారు. పామాయిల్‌ రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రుచిసోయా సంస్థ కూడా ముందుకు రావడం అభినందనీ యమని హర్షం వ్యక్తం చేశారు. మొత్తంగా ఇప్పుడు పామాయిల్‌ రైతుల పంట పండిరది. ఇన్నాళ్లకు కష్టానికి ఫలితం దక్కింది. పెరిగిన ధరలతో పామాయిల్‌ సాగు చేసే రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కొద్దినెలలుగా గెలల ధరలు పెరుగుతూ ఇప్పుడు రూ.22,521కి చేరి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. ఎన్నడూ చూడని ధరలతో రైతులు పామాయిల్‌ సాగు వైపు మొగ్గు చూపేలా పరిస్థితులు మారాయి. ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న పామాయిల్‌ గెలల ధరను తెలంగాణ రాష్ట్రంతో సమానంగా రైతులకు చెల్లించేందుకు ఆంధ్రాకు చెందిన నవభారత్‌, గోద్రెజ్‌ సంస్థలకు చెందిన యాజమాన్యాలు అంగీకరించాయి. ఆంధ్రాలో ప్రస్తుతం టన్ను పామాయిల్‌ గెలల ధర రూ.21,940 చొప్పున రైతులకు చెల్లిస్తుండగా తెలంగాణలో చెల్లిస్తున్న రీతిలో అనగా రూ.22,521 చొప్పున చెల్లించేం దుకు ఆ రెండు సంస్థలు అంగీకరించాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రుచిసోయా కంపెనీ ఇంకా ఈ ధరను చెల్లించడంలేదు. దీనివల్ల తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పామాయిల్‌ రైతులు టన్ను ఒక్కింటికి రూ.581 చొప్పున నష్టపోవాల్సి వస్తోంది.