పామేడు ఎన్‌కౌంటర్‌ మృతుడు వివేక్‌

2

– కమాండర్‌ వివేక్‌ది సూర్యాపేట

– ఎన్‌కౌంటర్‌ బూటకం

– మావోయిస్టు పార్టీ

ఖమ్మం 13 జూన్‌ (జనంసాక్షి) :

ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల్లో ఒకరు నల్లగొండ జిల్లా సూర్యాపేట వాసిగా తెలియవచ్చింది. సూర్యాపేటకు చెందిన కొలనుగుండ్ల యోగానందాచారి, మాధవి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న వాడైన నవీన్‌ ఉస్మానియాలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడని, అతడే ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని సమాచారం. కాగా, యోగానందాచారి నూతన్‌కల్‌లోను, మాధవి వరంగల్‌ జిల్లా కుమ్మరకుంట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నవీన్‌ చదువులో చురుకైన వాడని, చాలా బుద్ధిమంతుడని..అతడు మావోయిస్టు పార్టీ కార్యకర్త అంటే నమ్మలేకపోతున్నామని స్థానికులు అంటున్నారు.

వివేక్‌ ది ఎన్‌ కౌంటర్‌ కాదు – మావోయిస్టు పార్టీ

తెలంగాణా యోధుడు వివేక్‌, మరో ఇద్దరు మావోయిస్టుల ఎన్‌ కౌంటర్‌ బూటకమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆ ముగ్గురిపై పోలీసులు ఏక పక్షంగా కాల్పులు జరిపి చంపారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ విూడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. ఈ ముగ్గురి హత్యలకు నిరసనగా ఈ నెల 16న తెలంగాణ బంద్‌ పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వివేక్‌ తోపాటు కమల ఎలియాస్‌ మడకం దేవే సోనీ ఎలియాస్‌ కుహడమ్‌ జోగి లు ఈ నెల 12న చత్తీస్‌ గడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా లంకపల్లి అనే గ్రామానికి పోయి గ్రామస్తులతో మాట్లాడి వస్తుండగా ఓ ఇన్ఫార్మర్‌ ఇచ్చిన సమాచారంతో పథకం ప్రకారం చెట్ల చాటున మోహరించిన వందల మంది పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపి ఈ ముగ్గురి హత్య చేశారని జగన్‌ అన్నారు. చత్తీస్‌ గడ్‌ , తెలంగాణా ప్రభుత్వాలు మూడవ గ్రీన్‌ హంట్‌ దాడిని కొనసాగించడంలో భాగంగానే ఇవి జరిగాయని ఆయన ఆరోపించారు.రెండు రాష్ట్రాల పోలీసులు బార్డర్‌ లో ఉన్న ఊళ్ళ పై కొంత కాలంగా దాడులు చేస్తూ ఈళ్ళను కూలుస్తూ, ఆదివాసులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని జగన్‌ అన్నారు. అలా చిత్రహింసలకు బలైన లంకపల్లి గ్రామస్తులకు ధైర్యం చెప్పేందుకు వెళ్ళిన వివేక్‌ మరో ఇద్దరు తమ కార్యకర్తలను పోలీసులు కాల్చి చంపారని జగన్‌ మండిపడ్డారు. చని పోయిన ముగ్గురిలో కమలది చత్తీస్‌ గడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా బాపగూడెం బ్లాక్‌ లోని చిన్న తెర్రెం గ్రామంకాగా సోనీది తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం జగ్గారం గ్రామం. వివేక్‌ ది నల్లగొండ జిల్లా సూర్యాపేట.