పారా హుషార్..
– ఢిల్లీలో ముష్కరులు
– ఇంటలీజెన్స్ హెచ్చరికలతో సోదాలు
న్యూఢిల్లీ,జనవరి 3(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటలిజెన్స్ బ్యూరో మరోసారి హెచ్చరించింది. 15 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని, ఇద్దరు ఢిల్లీలోకి ప్రవేశించినట్టు భద్రత బలగాలకు సమాచారం అందించింది. ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రముఖులు నివసించే ప్రాంతంలో మరింత భద్రతను పెంచారు. ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశముందని వారం క్రితం కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి.పంజాబ్‌లోని పఠాన్‌కోట్
ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. తనిఖీల అనంతరం రైళ్లు ఆలస్యంగా బయల్దేరాయి.