పారిశుద్ద్య కార్మికులకు వేతనాలు పెంపు

5

– 47.05 శాతం పెంచుతున్నట్టుగా సీఎం కేసీఆర్‌ ప్రకటన

హైదరాబాద్‌,జులై16(జనంసాక్షి):

జీహెచ్‌ఎంసీ కార్మికులు, డ్రైవర్ల జీతాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీగా పెంచారు. వేతనాలను ఒక్కసారిగా 47.05 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 24 వేల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం నెలకు రూ. 8,500 జీతం పొందుతున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.12,500లకు, నెలకు రూ. 10,200 లు జీతం అందుకుంటున్న డ్రైవర్ల వేతనాన్ని రూ. 15 వేలకు పెంచాలని నిర్ణయించారు.

ఇవాళ్టి వరకు సమ్మె విరమించి విధులకు హాజరైన వారికి ఈ నెల నుంచే పెంచిన వేతనాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటి వరకు సమ్మె విరమించి విధులకు హాజరుకాని వారిని, సమ్మెలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని, అనుచితంగా ప్రవర్తించిన వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ ను ఆదేశించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం, ఆర్టీసీ కార్మికులకు 44 శాతం జీతాలు పెంచిన తాము.. కార్మికులపై ప్రేమ, సానుభూతితోనే 47 శాతం జీతాలు పెంచినట్టు సీఎం కేసీఆర్‌ చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల పనితీరుకు మెచ్చి, స్వచ్ఛ హైదరాబాద్‌ సందర్భంగా ఇచ్చిన హావిూ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

నాయకులుగా చలామణి అయ్యేవారు కొందరు జీతాలు పెరిగిన ప్రతిసారి ఒక్కో కార్మికుడి నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని కార్మికులకు సూచించారు. ఈసారి ఎవరైనా అలా వసూలు చేస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.